ఇసుక అక్రమ నిల్వలపై విజిలెన్సు దాడులు
శ్రీకాకుళం, ఆగస్టు 3 : విజిలెన్స్, భూగర్భ జలశాఖ అధికారులు దాడులు నిర్వహించి సంతకవిటి మండల పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను పట్టుకున్నారు. మండల పరిధిలోని చిత్తారపురం, హోంజరాం, బూరాడపేట, తమరాం, మేడమర్తి, పి.జె.పేట గ్రామాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. చిత్తారపురంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన 141.50 క్యూబిక్ మీటర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమంగా నిల్వ చేసిన గోవిందరావుకు రూ. 33 వేలు జరిమానా విధించినట్లు విజిలెన్సు సిఐ సి.అంబేద్కర్ తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ చేసినా, నది నుంచి అక్రమంగా తరలించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న ఇసుకను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. దాడుల్లో జిల్లా విజిలెన్సు, భూగర్భ జలశాఖ అధికారులు బి.సూర్యనారాయణ, ఆర్.తమ్మినాయుడు, బి.సత్యనారాయణ, లక్ష్మణరావు తదితరులు పాల్నొన్నారు.