ఇసుక అక్రమ రవాణాకు చెక్
కరీంనగర్,ఏప్రిల్17(జనంసాక్షి): ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై దొంగతనం కేసులు నమోదు చేస్తామని మైనింగ్ అధికారులు స్పష్టం చేశారు. పట్టుబడిన వాహనాల డ్రైవర్లు, యజమానులపై కూడా కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇసుకను అక్రమంగా నిల్వ చేయొద్దనీ, అలా చేస్తే సంబంధిత భూ యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి, ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో ఇసుక నిల్వలపై గడ్డి కప్పి ఉంచేవారని, ప్రస్తుతం ఎవరికీ అనుమానం రాకుండా ఇసుకపై ఎర్రమట్టి నింపుతున్నారని చెప్పారు. స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, క్యూఆర్‌టీ విభాగాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇసుక అక్రమ రవాణాపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.