ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ కృషి అమోఘం

అవాంతరాలను అధిగమించే మేధావి
తోటి శాస్త్రవేత్తలతో నిరంతర సమన్వయం
శ్రీహరికోట,జూలై23(జ‌నంసాక్షి): మిషన్‌ చంద్రయాన్‌ విజయం వెనక ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ నిరంతర కృషి దాగివుంది. ఆయన టెక్నాలజీ పరంగా తన అనుభవాన్‌ఇన రంగరించి ముందుకు సాగారు. తోలి శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తూ ముందడుగు వేశారు. ఇస్రో విజయాలకు మిషన్‌ మ్యాన్‌గా నిలిచారు.
ఇస్రో శాస్త్రవేత్తల సమిష్టి కృషితోనే చంద్రయాన్‌-2 విజయవంతమైందని ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ చేసిన ప్రకటన ఆయన హుందాకు నిదర్శనంగా చూడాలి.  చంద్రయాన్‌-2 ప్రయోగానంతరం  మాట్లాడిన ఆయన
గత వారం సాంకేతిక సమస్యను గుర్తించిన వెంటనే యావత్తు బృందం కార్యాచరణలోకి దిగిందని, ఆ తదుపరి 24 గంటల్లో వెహికల్‌ను సాధారణ స్థితికి తెచ్చేందుకు బృందం చేసిన కృషి అద్భుతం, అనిర్వచనీయమని చెప్పారు. జీఎస్‌ఎల్వీ మాక్‌-3 రాకెట్‌ చంద్రయాన్‌-2ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ప్రకటించేందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానని అన్నారు. ఈ మిషన్‌ విజయవంతం కోసం భారత్‌ మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురుచూసిందని, దాన్ని తాము సుసాధ్యం చేశామన్నారు. చంద్రయాన్‌-2 ప్రస్థానం ఎన్నో అవాంతరాల మధ్య సాగింది. ఈ ప్రయోగం కోసం కలిసి పనిచేయాలని ఇస్రో తొలుత రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కోస్మాస్‌తో 2017 నవంబర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇస్రో ఆర్బిటార్‌, రోవర్‌ రూపొందిస్తే, రోస్కోస్మాస్‌ ల్యాండర్‌ను సమకూర్చాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ ప్రకారం ఇస్రో చంద్రయాన్‌-2 పేలోడ్స్‌ను ఖరారు చేసినప్పటికీ, రష్యా సకాలంలో ల్యాండర్‌ను అభివృద్ధి చేయకపోవడంతో ఈ మిషన్‌ 2016కు వాయిదా పడింది. మరోవైపు అంగారకుడిపైకి రష్యా చేపట్టిన ఫోబోస్‌-గ్రంట్‌ మిషన్‌ విఫలమైంది. ఇందులోని సాంకేతిక అంశాలనే చంద్రయాన్‌-2లో వినియోగించాల్సి ఉండడంతో వీటిపై సవిూక్షించాలని రష్యా పేర్కొంది. 2015 నాటికి కూడా రష్యా ల్యాండర్‌ను సమకూర్చే పరిస్థితి లేకపోవడంతో ఇక సొంతంగానే ల్యాండర్‌ను అభివృద్ధి చేయాలని ఇస్రో సంకల్పించింది. 2018 మార్చిలో చంద్రయాన్‌-2ను ప్రయోగించాలని భావించినా వివిధ కారణాల వల్ల అదే ఏడాది ఏప్రిల్‌కు, అనంతరం సెప్టెంబర్‌కు, ఆ తర్వాత 2019 తొలి అర్ధభాగానికి వాయిదా పడింది. ఈ నెల 15న మరోసారి వాయిదాపడ్డ చంద్రయాన్‌-2 సోమవారం దిగ్విజయంగా నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రుని ఉత్తర ధ్రువంతో పోలిస్తే, దక్షిణ ధ్రువం అత్యధిక భాగం నీడలో ఉంటుంది. శాశ్వతంగా నీడలో ఉండే ప్రాంతాల్లో నీరు ఉండే అవకాశం ఉన్నది. దక్షిణ ధ్రువంలో ఉన్న గుంతలు చెమ్మతో ఉంటాయి. సౌర కుటుంబం పరిణామ క్రమానికి సంబంధించిన శిలాజాలు కూడా ఇక్కడ ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇస్రో చంద్రయాన్‌-2 కోసం దక్షిణ ధ్రువాన్ని ఎంచుకుంది.
సామాన్యుడే ఈ అసామాన్యుడు
సామాన్య రైతు కుటుంబంలో పుట్టి.. ఇస్రోకు నేతృత్వం వహించే స్థాయికి ఎదగడం వెనుక శివన్‌ అచంచల కృషి ఉంది. క్రయోజెనిక్‌ ఇంజిన్‌ అభివృద్ధిలో ఆయన అందించిన సేవలకు గాను ఆయనను రాకెట్‌ మ్యాన్‌గా పిలుస్తుంటారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌ సవిూపంలోని మేళాసరక్కల్విలైలో 1958లో శివన్‌ జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలో తమిళ విూడియంలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేశారు. తన కుటుంబంలో తొలి గ్రాడ్యుయేట్‌ శివనే కావడం విశేషం. 1980లో మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. అనంతరం 1982లో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ నుంచి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ సాధించారు. తర్వాత ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. 2006లో ఐఐటీ బాంబే నుంచి డాక్టొరల్‌ డిగ్రీ పొందారు. 1982లో పీఎస్‌ఎల్వీ ప్రాజెక్ట్‌లో చేరిన శివన్‌.. మిషన్‌ ప్లానింగ్‌, డిజైన్‌, ఇంటిగ్రేషన్‌, అనాలిసిస్‌లో కీలకపాత్ర పోషించారు. ఇస్రో వాహకనౌకల పథ నిర్దేశానికి వెన్నెముక లాంటి 6డీ ట్రాజెక్టరీ సిములేషన్‌ సాప్ట్‌వేర్‌ సితారకు శివనే చీఫ్‌ ఆర్కిటెక్ట్‌. ఇస్రో కదనాశ్వం పీఎస్‌ఎల్వీ ద్వారా మంగళ్‌యాన్‌ను దిగ్విజయంగా ప్రయోగించడంలో శివన్‌ కీలక పాత్ర పోషించారు. 2011 ఏప్రిల్‌లో ఆయన జీఎస్‌ఎల్వీ ప్రాజెక్ట్‌లో చేరారు. ఆయన సారథ్యంలోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో జీఎస్‌ఎల్వీని అభివృద్ధి చేశారు. 2018 జనవరిలో ఇస్రోకు తొమ్మిదో చైర్మన్‌గా శివన్‌ నియమితులయ్యారు.