ఈక్వెడార్‌లో 272కు చేరిన మృతులు

ముమ్మరంగా కొనసాగుతున్న సహాయకచర్యలు
న్యూఢిల్లీ,ఏప్రిల్‌18 : ఈక్వెడార్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 272కు చేరింది. సహాయక  కార్యక్రమాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది.  విపత్తులో 2,527 మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు జార్జి తెలిపారు.  ఈక్వెడార్‌ దేశాన్ని పెను భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. రిక్టర్‌ స్కేలుపై 7.8 త్రీవతతో సంభవించిన భూకంపం తీవ్రతకు పసిఫిక్‌ తీర ప్రాంతాల్లోని పట్టణాలు బాగా దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ భవనాలు కుప్పకూలి శిథిలాల దిబ్బగా మారాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం పెద్ద ఎత్తున సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం నేపథ్యంలో ఇప్పటికే ఆరు రాష్టాల్ల్రో అత్యవసర పరిస్థితి విధించారు. భవనాల కింద చిక్కుకున్న వారిని కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఈక్విడార్‌ దేశాధ్యక్షుడు తెలిపారు. సుమారు 10 వేల మంది సహాయక సిబ్బంది, 3500 మంది పోలీసులు సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు. ప్రజలు కూడా శిథిలాల్లో చిక్కుకున్న తమ వారి కోసం గాలిస్తున్నారు. భూకంప ప్రభావం తీవ్రంగా ఉన్న పెడర్నలీస్‌లో మరో 400 మంది మృతిచెంది ఉంటారని అక్కడి మేయర్‌ గాబ్రియెల్‌ అల్సీవార్‌ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఇదిలావుంటే పోర్టోవీజో పట్టణంలో 100 మంది ఖైదీలు తప్పించుకుపోగా వారిలో 30 మందిని తిరిగి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.