ఈజిప్టు తరహాలో తెలంగాణ పోరు
ఒడిసేలలో రాళ్లు నింపుకుంటున్న మన ఉద్యమం
-బద్దలయ్యేందుకు సిద్ధమవుతున్న అగ్నిపర్వతం
-ఫేస్ బుక్‌లో టీ సైనికుల సమరసన్నాహం
-సెప్టెంబర్ 30న మరో ‘మిలియన్ మార్చ్’
-తెలంగాణ జేఏసీ నాయకత్వంలో వ్యూహ రచనఉద్యమ తెలంగాణ ఒడిసెలలో రాళ్లు నింపుకుంటున్నది.
ఈజిప్ట్ తరహాలో ఉద్యమించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. తమను పట్టి పీడించిన పాలకులను తరిమికొట్టిన ఆ దేశ ప్రజలే స్ఫూర్తిగా యావత్ తెలంగాణ కదంతొక్కేందుకు, సీమాంధ్ర ఆకృత్యాలకు వ్యతిరేకంగా సమర శంఖం పూరిస్తున్నది. ఈజిప్ట్ ఉద్యమాన్ని ఉధృతం చేసిన సోషల్ నెట్వర్క్ సైట్లో ఉద్యమ అగ్నిపర్వతం విస్ఫోటనానికి సిద్ధపడుతున్నది. ఆ వెబ్సైట్లో రోజు రోజుకూ మలిదశ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. గతంలో నిర్వహించిన ‘మిలియన్ మార్చ్’ స్ఫూర్తిగా దాన్ని మించిన ‘తెలంగాణ మార్చ్’ నిర్వహణకు ప్రణాళికలు రూపుదాల్చుకుంటున్నాయి. పామును మట్టి కరిపించిన చీమలదండు వలె తెలంగాణ ప్రజలు సమరానికి సై అంటున్నరు.
హైదరాబాద్, జూలై 19 (జనంసాక్షి) : మలి దశ ఉద్యమానికి సన్నాహాలు ఊపందుకున్నాయి. వచ్చే నెలలో మొదలు కానున్న మలిదశ ఉద్యమ జ్వాలాముఖి సెప్టెంబర్ 30న ‘తెలంగాణ మార్చ్’తో బద్దలు కానుంది. ఈ నేపథ్యంలో మళ్లీ తెలంగాణవాదులందరినీ ఏకతాటి పైకి తెచ్చేందుకు జేఏసీ తీవ్రంగా శ్రమిస్తున్నది. రాష్ట్రపతి ఎన్నికను అస్త్రంగా వాడుకుంటారనుకున్న తెలంగాణ ఎంపీలు ఉసూరుమనిపించి, అధిష్టానానికి మోకరిల్లడంతో ఈ మలిదశ ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహించాలని జేఏసీ భావిస్తోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఏ మాత్రం పట్టించుకోక తెలంగాణ వ్యతిరేకి ప్రణబ్‌కు ఓటేసిన టీఎంపీలకు సకల జనుల సమ్మెలో మాదిరిగానే మళ్లీ ఉద్యమ సెగ తాకేలా వ్యూహ రచనలు చేస్తోంది. ఆగస్టు 1 నుంచి నిరసనలు, సెప్టెంబర్ 30న తెలంగాణ మార్చ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ జేఏసీ కొన్ని రోజుల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు చేయని ఉద్యమ రూపం లేదు. ఒక ప్రాంతానికి చెందిన నాలుగున్నర కోట్ల ప్రజలు ఒకే ఆకాంక్ష కోసం ఏకధాటిగా ఉద్యమించడం ప్రపంచ చరిత్రలో తెలంగాణ ఉద్యమం తప్ప మరోటి లేదు. ధర్నాలు, రాస్తారోకోలు, విధుల బహిష్కరణ, కార్యాలయాల ముట్టడి, నాయకుల దిగ్బంధం ఇలా అనేక రూపాల్లో నిరసన తెలిపి తెలంగాణ అంశంపై పాలకులు అవలంబిస్తున్న వైఖరిని ఎండగట్టారు. సకల జనుల సమ్మెతో 42 రోజులపాటు కుల, మత, జాతి, వర్గ భేదాలు లేకుండా కదంతొక్కి ప్రపంచ దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం సకల జనుల సమ్మెను నిర్వీరం చేసినా, రాష్ట్రం ఇవ్వాల్సిందేనని నేటి వరకూ ఉద్యమిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సకల జనుల సమ్మెను మించి తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి సారథ్యంలో మహాసంగ్రామానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జేఏసీ నాయకత్వంలో కార్యాచరణను కూడా రూపొందించుకున్నారు. ఆగస్టు 1 నుంచి ఈ కార్యాచరణ అమలు చేయనున్నట్లు జేఏసీ చైర్మన్ కోదండరాం ఇది వరకే ప్రకటించారు. ఈ కార్యాచరణలో భాగంగా రెండు నెలలపాటు ఉద్యమాన్ని వివిధ రూపాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఈ లోపు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వస్తే సరేసరి, లేకుంటే, సెప్టెంబర్ 30న ఇంతకు ముందు నిర్వహించిన ‘మిలియన్ మార్చ్‌ను మించి’ ‘తెలంగాణ మార్చ్’ను నిర్వహిస్తారు. దీన్ని బట్టి చూస్తే ఈసారి పాలకులకు ఉద్యమ వేడి చాలా తీవ్రంగా తగిలేట్టు ఉన్నదని, ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించాలని పలు రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. అసలే అంతంత మాత్రంగా పాలన వ్యవహారాలు నడుపుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలకులు, ఉద్యమ ఉధృతిని ఎలా తట్టుకుంటారో వేచి చూడాల్సిందే.