ఈజిప్టు తరహా ఉద్యమానికి మోగింది నగారా !
తెలంగాణ దారులన్ని సాగరం వైపే..
హుస్సేన్ సాగర్ తీరాన కొలిమంటుకున్న జాడ !
కూసునేది రెండింటికి.. లేసేదెప్పుడో తెల్వది..
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ తన ప్రత్యేర రాష్ట్ర ఆకాంక్షను చాటేందుకు, యావత్ ప్రపంచానికి ప్రజా ఉద్యమ సత్తా తెలిపేందుకు సర్వ సన్నాహాలతో బయలుదేరిండు. జత బట్టలు సంచిలో పెట్టుకున్నడు.. కారం రొట్టెతో సద్ది కట్టుకున్నడు. రాజధాని నగరం వైపు వడివడిగా అడుగులేస్తున్నడు. ఇంకొద్ది సేపట్లో చారిత్రక సరస్సు కాడికి చేరుకోనున్నడు. రాజ్యమిచ్చిన అనుమతి కన్నా, తాను నిర్ణయించుకున్న సమయం దాకా గొంతు బొంగురు పోయినా గళమెత్తేందుకు సిద్ధంగా ఉన్నడు. యాభై ఐదేళ్లుగా కొట్లాడుతున్నా, సమరోత్సాహం తగ్గని పందెం కోడిలా పోరాటానికి సై అంటున్నడు. తాను చూసిన ఈజిప్టు ఉద్యమ ఫలితం స్ఫూర్తిగా నగరా మోగించి మరీ వస్తున్నడు. అదే ఉద్యమ తరహాలోనే, ఇక ముందు తన పోరాటం ఉంటుందని బల్లగుద్దీ మరీ చెప్తున్నడు. సీమాంధ్ర దౌర్జన్యాల సంకెళ్లతో విలవిల్లాడుతున్న తెలంగాణ సంకెళ్లను తెంచి, కొత్త ఉదయాన్ని లోకానికి చూపిస్తానని ప్రతిన బూనినోడు వాడు. రక్త పిపాసులు తన అక్కల, తన అన్నల, తన తమ్ముళ్ల, తన చెల్లెళ్ల రక్తాన్ని పీల్చుతుంటే, అగ్ని ఆహుతి చేస్తుంటే కళ్లారా చూసినోడు వాడు. కన్నీరు కార్చినోడు వాడు. ఈ దాష్టీకం ఇగ భరించనంటూ.. రక్తం సలసల మరుగుతుంటే, రాజధానిలో రాజ్యంతో తేల్చుకుంటానని, నా తోడబుట్టినోళ్లు కోరిన దాంట్లో తప్పేందంటూ ప్రశ్నించడానికి.. నాది కూడా అదే ‘ప్రత్యేక’ ఆకాంక్ష.. ఎందుకు తీర్చరంటూ గల్లా పట్టి నిలదీయడానికి ఆ తెలంగాణ బిడ్డ వస్తున్నడు. చూస్తుంటే.. వచ్చింది వెనక్కి వెళ్లడానికి కాదు.. తెలంగాణ సాధించడానికి.. అన్నట్లు సీమాంధ్ర పాలకులను కొరకొర చూపులతో హెచ్చరిస్తున్నడు. ఇంటి నుంచి తెచ్చుకున్న ‘తెలంగాణ జెండా’ను పైపైకెత్తి, నింగినంటేలా రెపరెపలాడిస్తున్నడు, ‘జై తెలంగాణ’ అంటూ గర్జిస్తున్నడు. వస్తున్నడు.. వస్తున్నడు.. అగ జూడు వచ్చేసిండు.. ‘జై తెలంగాణ.. జై జై తెలంగాణ’.
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమ చరితలో మరో కీలక ఘట్టం నేడు ఆవిష్క్రృతం కానుంది. సబ్బండ వర్ణాల నినాదాలతో రాజధాని నగరంలో హోరెత్తనుంది. ఈజిప్టు తరహాలో ఉద్యమించేందుకు యావత్ తెలంగాణ సిద్ధమైంది. తెలంగాణ వచ్చేదాకా నెక్లెస్ రోడ్డును వీడే ప్రసక్తే లేదని తెలంగాణవాదులు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది ! ఇదిలా ఉంటే, ప్రభుత్వం కేవలం నాలుగు గంటలే తెలంగాణ మార్చ్, సాగర హారాన్ని నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ, తెలంగాణవాదులు మాత్రం శాంతియుతంగానే, నిరసనను ఎక్కువ సేపు చేయాలని భావిస్తున్నారు. ఈ లెక్కన హుస్సేన్ సాగర్ తీరాన కొలిమంటుకున్న జాడలు కానవస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. సాగర హారం మరో తెలంగాణ ఉద్యమంలో కలికితురాయి మిగిలిపోతుందని విశ్లేషిస్తున్నారు. ఈజిప్టు ఎలాగైతే అక్కడి ప్రజలు తమ ఆకాంక్ష నెరవేరే దాకా, రోడ్లపైనే కూర్చుని నిరసన తెలిపారో, అదే తరహాలో తెలంగాణ మార్చ్‌ను కొనసాగించాలని తెలంగాణవాదులు అనుకుంటున్నట్లు సమాచారం. తమ నిరసనతో ఢిల్లీ పెద్దల వెన్ను పుట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేలా తమ కార్యాచరణ ఉందని పలువురు తెలంగాణవాదులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మార్చ్ సారథి, జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ నెక్లెస్ రోడ్డుపై రెండు గంటలకు కూర్చున్నా, లేచేదెప్పుడో చెప్పలేమని ప్రకటించారు. ఇంతకాలం బలిదానాలతో తెలంగాణ సాధిద్దామనుకున్న యువత, ఇప్పుడు ఉద్యమ శంఖారావాన్ని పూరించి, తమ సత్తా చాటాలని ఆయన కోరుతున్నారు. ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ మార్చ్‌కు అనుమతి సాధించామని, ఈ మార్చ్‌ను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఇక తెలంగాణ ప్రజలదేనని కోదండరాం వెల్లడించారు. ప్రజలందరూ తమ ఆకాంక్షను చాటేందుకు తెలంగాణ మార్చ్ వేదిక కాబట్టి, భారీగా తరలివచ్చి తమ గళాన్ని వినిపించాలని ఆయన పునరుద్ఘాటించారు.