ఈత మొక్కల పెంపకానికి ప్రాధాన్యం
కోటీ 32 లక్షల మొక్కల పసెంపకం లక్ష్యంగా ప్రణాళిక
కామారెడ్డి,జూలై13(జనం సాక్షి): నాలుగో విడత హరితహారం కోటీ 32 లక్షల మొక్కలను 136 నర్సరీల ద్వారా నాటడానికి సిద్ధంగా ఉంచామని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. 526 పంచాయతీల్లో ప్రదేశాలను గుర్తించి శిక్షణ ఇచ్చామని వివరించారు. పంచాయతీల వారీగా గుర్తించిన ప్రదేశాలను, మొక్కల వివరాలను అప్లోడ్ చేయాలని సూచించారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత మొక్కలను విస్తారంగా నాటేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. హరితహారంలో భాగంగా రాశివనాలను అభివృద్ధి చేసి ప్రజలు భాగస్వాములయ్యేలా చూడాలని తెలిపారు. వాణిజ్య సంఘాలు స్వచ్ఛందంగా మొక్కలు నాటేలా వారిని ప్రోత్సహిస్తామన్నారు. మున్సిపాలిటీలలో ఖాళీ ప్రభుత్వం స్థలాల్లో మొక్కలు నాటి గ్రీన్ జోన్, పార్క్, ఆక్సిజన్ పార్క్లుగా రూపొందించాలని అన్నారు. ప్రతి గ్రామంలో 5 ప్రదేశాల్లో ఒక ఎకరం మొదలు కొని పార్కులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. హరితహారాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టడానికి ప్రభుత్వ సంస్థలు పాఠశాలలు,కళాశాలలు, పరిశ్రమలు ముందంజలో ఉండాలని అన్నారు.
నాలుగో విడత హరితహారాన్ని త్వరలో సీఎం కేసీఆర్ భూపాలపల్లి జిల్లాలో ప్రారంభిస్తారని అనంతరం జిల్లాల వారీగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు స్థలాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 6 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు 6 మొక్కలు చొప్పున నాటడానికి ప్రదేశాలను ఎంపిక చేసి ఉంచామని అన్నారు. గతంలో నాటిన మొక్కలు ఎండిపోయిన పక్షంలో ఆ ప్రదేశాల్లో మొక్కలు నాటడానికి ప్రా ధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.