ఈసీ స్వతంత్రంగా ఉండాలి

– కుట్రదారుల మాటలతో అధికారులను బదిలీచేయడమేంటి
– తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్‌
అమరావతి, మార్చి28(జ‌నంసాక్షి) : ఈసీ రాజ్యాంగ బద్దంగా నడుకోవాలని, ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించి తీరాలని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్‌ అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు..  నిష్పక్షపాతంగా ఎన్నికలను జరపాల్సిన బాధ్యత ఆ రాజ్యాంగ వ్యవస్థపై ఉందని ఆయన గుర్తు చేశారు. కుట్రదారుల మాటలు నమ్మి అధికారులను బదిలీ చేయడమేంటని ప్రశ్నించారు. ఓ సందర్భంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఎన్నికల్లో భాగం కాదని వ్యాఖ్యానించిన ఈసీ.. ఇప్పుడు ఏపీ నిఘా విభాగాధిపతిని బదిలీ చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఫారం-7 దరఖాస్తులు పెట్టింది తానేనని బహిరంగ సభలో జగన్‌ ఒప్పుకున్నారని దినకర్‌ పేర్కొన్నారు. దీనిపై మేం ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఫారం-7 పేరుతో నకిలీ దరఖాస్తులు చేసిన వైకాపా నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఫిర్యాదులు వస్తే అధికారుల వివరణ తీసుకోకుండా ఎలా చర్యలు తీసుకుంటారు అని దినకర్‌ నిలదీశారు. పనిచేస్తున్న అధికారులను వైకాపా చెప్పిందని బదిలీలు చేయిస్తారా అని ప్రశ్నించారు. వివేకా హత్యపై సిట్‌ నివేదిక వెలువడే సమయంలో అధికారి బదిలీ చేయడం సబబేనా? అన్నారు. భాజపా పాలిత ఝార్ఖండ్‌లో ఇంటిలిజెన్స్‌ డీజీ ఎమ్మెల్యేల కొనుగోలులో పట్టుబడినా చర్యల్లేవని గుర్తుచేశారు. నిఘా అధికారిని తప్పించాలని ఈసీ ఆదేశాలను భాజపా సర్కారు అమలు చేయలేదని పేర్కొన్నారు. ఈసీ స్వతంత్రంగా ఉన్నట్లు కనిపించడమే కాదు.. అలా ఉండాలని వ్యాఖ్యానించారు.