ఈసెట్‌ ఫలితాలు విడుదల చేసిన ఉన్నతవిద్యాశాఖ


ఫలితాల్లో 95.16 శాతం మంది విద్యార్థులు అర్హత
ఈ నెల 26 నుంచి 31 వరకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు
హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): పాలిటెక్నిక్‌ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్‌, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు రాసిన తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో 95.16 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 3న జరిగిన ఈసెట్‌కు సుమారు 24 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 24 నుంచి ఈసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ పక్రియ ప్రారంభం కానుంది. 24 నుంచి 28 వరకు స్లాట్‌ బుకింగ్‌, 26 నుంచి 29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈ నెల 26 నుంచి 31 వరకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి. సెప్టెంబరు 2న ఈసెట్‌ అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబరు 2 నుంచి 7 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. సెప్టెంబరు 13న తుది విడత ప్రవేశాల షెడ్యూలు ప్రారంభం కానుంది. సెప్టెంబరు 14న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. సెప్టెంబరు 14, 15 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 17న తుది విడత ఈసెట్‌ సీట్లను కేటాయిస్తారు.