ఈ అమ్మాయి ఐన్‌స్టీన్‌కన్నా మేధావి
లండన్ : భారతీయ సంతతికి చెందిన నేహారాము(12) మేథోశక్తి ప్రపంచాన్ని అబ్బుర పరుస్తోంది. ఆమె మేథస్సు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్, బిల్‌గేట్స్‌లాంటివారి కంటే ఎక్కువ. వీరందరి మేథస్సు స్థాయి 160. నేహారాము 162 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించింది. మేథస్సు స్థాయి సూచీలు కొలవడానికి యూకేలోని ‘మెన్స’ నిర్వహించే ‘ఐఐఐబీ’లో పరీక్షలో ఈమె రికార్డు పాయింట్లు సాధించింది. నేహ ఏడేళ్ల వయస్సులో ఆమె తల్లిదండ్రులు మునిరాజు, జయశ్రీలు భారత్ నుంచి కింగ్‌స్టన్‌కు వలస వెళ్లారు. వీరిద్దరూ వైద్యులే. నేహారాము సాధించిన విజయంతో ఆమె తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ఆమె మేథస్సు మొదట్లో ఆమె తల్లిదండ్రులు పెద్దగా గుర్తించలేదు. అయితే ఒకసారి అక్కడ స్థానికంగా ఒక ఆంగ్ల వ్యాకరణ పాఠశాల నిర్వహించిన ‘టిఫిన్ గాళ్స్’ అనే పరీక్షలో ఆమె 280కి 280 మార్కులు తెచ్చుకుంది. హారీ పోటర్ వీరాభిమాని అయిన నేహాకు ఈత అంటే మహా సరదా. తన తల్లిదండ్రులలాగే వైద్య వృత్తి చేపట్టాలని భావిస్తోంది. అమెరికాలోని హార్వర్డు విశ్వవిద్యాలయంలో సీటు కోసం ఆమె ప్రయత్నిస్తున్నారు. మెన్స పరీక్షలో ఇంత స్కోరు రావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.