ఈ నెల 12న నిర్వహించనున్న టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి -ఈ నెల 11న నిర్వహించే శిక్షణకు సంబంధిత అధికారులు హాజరు కావాలి -జిల్లా కలెక్టర్ కె. శశాంక

మహబూబాబాద్ బ్యూరో-జూన్ 10(జనంసాక్షి)

ఈ నెల 12న ఆదివారం రోజున నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడోక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో మొదటి పేపర్ -1 కు పరీక్షా కేంద్రాలు 26 ఏర్పాటు చేసి ఉదయం 9-30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షకు 6159 మంది అభ్యర్థులు, పేపర్-2 కు పరీక్షా కేంద్రాలు 23 ఏర్పాటు చేసి మధ్యాహ్నం 2-30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే పరీక్షకు 5270 మంది అభ్యర్థులు,  రెండు పేపర్ లకు కలిపి 11 వేల 429 మంది హాజరుకానున్నారు. మహబూబాబాద్ లో 12, తొర్రూర్ లో 10, మరిపెడ లో 4 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. హాల్టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, హాల్ టికెట్లో ఏమైనా తప్పులు ఉంటే గెజిటెడ్ అధికారితో, డి. ఈ. ఓ. తో అటెస్టేషన్ చేయించుకుని పరీక్ష సెంటర్లో ఇవ్వాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే డీఈఓ కార్యాలయము చరవాణి నెంబరు 91827 22510 లో సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు బ్లాక్ బాల్పాయింట్ పెన్ ను ఉపయోగించాలని, పరీక్ష కేంద్రానికి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్ అనుమతి లేదని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, 26 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 26 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 283 మంది ఇన్విజిలేటర్ లు, రూట్ అధికారులను నియమించినట్లు తెలిపారు. టెట్ పరీక్ష నిర్వహణకు కేటాయించబడిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు, రూట్ ఆఫీసర్స్, హాల్ సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్ లకు ఈనెల 11న ఫాతిమా హై స్కూల్ దగ్గర గల తొర్రూరు రోడ్డులోని బాలాజీ గార్డెన్స్ లో ఉదయం 8 గంటల నుండి నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని ఆదేశించారు.