ఈ పక్షి మిమిక్రీ చేస్తుందట
సిడ్నీ: మనుషుల్లో కొందరు ఇతరుల గొంతును అనుకరించడం మనకు తెలుసు. అయితే మనుషుల్లాగే ఓ పక్షి కూడా ఇతర జీవుల గొంతును అనుకరిస్తుందట. ఆస్ట్రేలియాకు చెందిన థోర్న్‌బిల్ అనే ఓ చిన్న పక్షి తోడేలు, రాబందుల్లా అరుస్తుందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనవర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఈ పక్షి గూటిలో ఉన్న తన పిల్లలకు ఇతర వేటజీవుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు రాబందులా అరవడం లేదా తోడేలులా ఏడ్వడం ద్వారా హెచ్చరికలు జారీ చేస్తుందట.
ఇది పూర్తిగా మిమిక్రీ కాకపోయినప్పటికీ గొంతును మార్చడం ద్వారా వేట జీవుల్ని హెచ్చరించి, అవి మోసపోయేలా చేస్తుందని పరిశోధకులు తెలిపారు. థోర్న్‌బిల్ దాని శరీరం కన్నా 40 రెట్లు పెద్దదైన పక్షుల్లా అరవడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. వేట జీవుల్ని హెచ్చరించేందుకు గొంతును మార్చగలిగే స్వభావం గల పక్షుల గురించి ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని వారు తెలిపారు. థోర్న్‌బిల్‌కు ఇతర జీవుల్ని కూడా అనుకరించే సామర్థ్యం ఉందన్నారు.