ఈ ప్రభుత్వాలు గద్దెదిగితేనే ప్రజల కష్టాలు తీరతాయి
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత తొందరగా గద్దెదిగితే ప్రజల కష్టాలు అంత తొందరగా తీరుతాయని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు చెప్పారు. ధరల పెరుగుదల, రైతు సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులో జరిగిన కార్యాక్రమంలో ఆయన పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం 24 సార్లు పెట్రోలు ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని మండిపడ్డారు. రైతులకు సకాలంలో ఎరువులు ఇవ్వలేని ప్రభుత్వం విచ్చలవిడిగా ఎరువుల ధరలు పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని సహా నలుగురు ప్రపంచస్తాయి ఆర్థికవేత్తలు దేశాన్ని పరిపాలిస్తున్నా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయనాయుడు సహా పార్టీ నేతలు కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, దత్తాత్రేయ, వెంకట్‌రెడ్డిలను పోలీసు అరెస్టు చేశారు.