ఈ మ్యాచ్ లో జోరు కొనసాగేనా?
పెర్త్: హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న ధోని సేన మరో సమరానికి రెడీ అయింది. ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-బీలో శుక్రవారం జరగనున్న పోరులో భారత్, వెస్టిండీస్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తోంది. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, యూఏఈ జట్లను మట్టికరిపించిన విండీస్ ను కంగుతినిపించాలన్న పట్టుదలతో ఉంది. మూడు వరుస విజయాలతో దూసుకుపోతున్న ధోని సేన జోరు కొనసాగించాలని తలపోస్తోంది.అయితే వెస్టిండీస్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. క్రిస్ గేల్ కళ్లెం వేయకుంటే టీమిండియా తిప్పలు తప్పవు. అతడిని అడ్డుకోవడంపైనే భారత్ విజయవకాశాలు ఆధారపడివున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మైదానం బయట వివాదాల్లో నలుగుతున్న భారత్ స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి ఇప్పటివరకు ఈ టోర్నీలో సిసలైన ఇన్నింగ్స్ ఆడలేదు. భారీ ఇన్నింగ్స్ బాకీ పడిన ఈ పరుగులువీరుడు బ్యాట్ ఝుళిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.