ఉక్రెయిన్‌ను 3 భాగాలు చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్
- రెండు వేర్పాటు వాద ప్రాంతాలకు స్వాతంత్య్రం
- ప్రత్యేక దేశాలుగా గుర్తింపు.. మండిపడ్డ ఉక్రెయిన్
- భూభాగాన్ని వదులుకునేది లేదని స్పష్టీకరణ
- రష్యాతో తెగదెంపులకు సిద్ధమేనని వెల్లడి
- రష్యాపై అమెరికా, బ్రిటన్, ఈయూ ఆంక్షలు
కీవ్/మాస్కో, ఫిబ్రవరి 22: ఉక్రెయిన్ సంక్షోభం మరింత ముదిరింది. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న దొనెట్స్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉక్రెయిన్ ప్రభుత్వానికి ఈ దేశాలతో ఇకపై ఎలాంటి సంబంధం ఉండబోదని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి జరిగిన రష్యా భద్రతా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. వేర్పాటు వాదుల సహాయార్ధం రష్యా తరఫున శాంతి పరిరక్షక దళాలను పంపుతున్నట్టు పుతిన్ వెల్లడించారు. అలాగే కొత్త దేశాల్లో సైనిక స్థావరాల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకొన్నట్టు ప్రకటించారు. అయితే, రష్యా తీసుకొన్న తాజా నిర్ణయం ఉక్రెయిన్‌పై ముప్పేట దాడి చేయడానికేనని పశ్చిమ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తించి తమ బలగాలను మోహరించే పనిలో రష్యా నిమగ్నమయ్యిందని ఆరోపించాయి.
ఎవ్వరికీ భయపడబోం
తమ తూర్పు ప్రాంతాన్ని స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ రష్యా చేసిన ప్రకటనపై ఉక్రెయిన్ మండిపడింది. తాము శాంతిని కోరుకొంటున్నామని, ఇదే సమయంలో తమ భూభాగాన్ని కోల్పోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేమని ఆ దేశ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ దేశ ప్రజలను ఉద్దేశించి మంగళవారం కీలక ప్రసంగం చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని రష్యా ఉల్లంఘిస్తున్నదని మండిపడ్డారు. ఎవ్వరి బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. తాము ఎవరికీ రుణపడిలేమని, అలాంటప్పుడు తమ భూభాగాన్ని కోల్పోవడానికి ఎలా సిద్ధంగా ఉంటామని ప్రశ్నించారు. రష్యాతో అన్ని సంబంధాలను తెంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
రష్యాకు యుద్ధమే కావాలి
ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా రష్యా గుర్తించడం ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించడమేనని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. రష్యా నిర్ణయాన్ని అమెరికా తప్పుబట్టింది. యుద్ధం చేయాలన్న దురుద్దేశంతోనే రష్యా ఈ అర్థంపర్థంలేని భయానక చర్యలకు పూనుకొన్నదని మండిపడింది. రష్యా చర్యలను బ్రిటన్, జర్మనీ, ఐరోపా సమాఖ్య (ఈయూ), దక్షిణ కొరియా, జపాన్, న్యూజిలాండ్. ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, టర్కీ తదితర దేశాలు ఖండించాయి. రష్యాపై ఆంక్షలు విధించబోతున్నట్టు అమెరికా, ఈయూ దేశాలు ప్రకటించాయి. మరోవైపు, బయటి దేశాల్లో బలగాలను వినియోగించేందుకు అనుమతినివ్వాలన్న అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదనకు రష్యా ఎగువసభ ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు. తాజా నిర్ణయంతో ఉక్రెయిన్‌పై దాడిచేసేందుకు రష్యా బలగాలను పెద్దఎత్తున పంపించబోతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నార్త్ స్ట్రీమ్ 2 గ్యాస్ పైప్‌లైన్‌ను నిలిపివేస్తున్నాం: జర్మనీ
రష్యా నుంచి జర్మనీకి సహజవాయువును సరఫరా చేసే నార్త్ స్ట్రీమ్ 2 గ్యాస్ పైప్‌లైన్ అనుమతుల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు జర్మనీ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా తీసుకొన్న ఏకపక్ష చర్యలకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించింది.
రష్యాపై ఆంక్షల కొరడా
ఉక్రెయిన్‌పై రష్యా ఏకపక్ష చర్యలను నిరసిస్తూ బ్రిటన్ ఆంక్షల కొరడా ఝళిపించింది. రష్యాలోని ఐదు బ్యాంకులపై కఠిన ఆంక్షలు విధించినట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం ప్రకటించారు. పుతిన్‌కు సన్నిహితులు, బిలియనీర్లు గెన్నడీ టిమ్‌చెన్కో, బోరిస్ రోటెన్‌బర్గ్, ఐగర్ రోటెన్‌బర్గ్‌పై కూడా ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఆంక్షల జాబితాలో ఉన్న వారి ఆస్తులు ఏమైనా బ్రిటన్‌లో ఉంటే వాటిని స్తంభింపజేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ముగ్గురిపై గతంలోనే అమెరికా ఆంక్షలు విధించింది.
శాంతి పక్షమే భారత విధానం
రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని దేశాల చట్టబద్ధమైన భద్రతా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొంటూ, పౌరుల భద్రత దృష్ట్యా ఉద్రిక్తతలు తగ్గించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ప్రపంచ శాంతి కోసమే భారత్ నిలబడుతుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ యూపీ సభలో తెలిపారు. మరోవైపు, ఆన్‌లైన్ క్లాసులు జరుగుతాయా? వాయిదా పడుతాయా? అనే యూనివర్సిటీల నిర్ణయం కోసం కొందరు భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉండిపోయారని, వెంటనే వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాలని అక్కడి భారత దౌత్య కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. ఉక్రెయిన్ నుంచి 242 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిరిండియా విమానం మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకొన్నది. గురువారం, శనివారం మరో రెండు విమానాలను నడుపనున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది.