ఉక్రెయిన్‌పై దాడిని ప్రపంచ దేశాలు వ్యతిరేకించాలి

పుతిన్‌ను ఒంటరి చేసేలా చర్యలు ఉండాలి
పుతిన్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు
రష్యా ఆర్థిక వ్యవస్థను స్థంభింపచేస్తాం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరిక
వాషింగ్టన్‌,మార్చి2(జనం సాక్షి): ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలకు పుతిన్‌ భారీ మూల్యం చెల్లించు కోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. ప్రతి ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడు కాంగ్రెస్‌లో వార్షిక ప్రసంగం చేస్తారు. స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి క్యాపిటల్‌ హిల్‌లో బైడెన్‌ ప్రసంగించారు. పుతిన్‌ పొరుగు దేశమైన ఉక్రెయిన్‌పై సైనిక చర్యలను ప్రకటిం చడం ద్వారా తప్పుగా అంచనా వేశారని, ఇందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. పుతిన్‌ను ప్రపంచం ఏకాకి చేయాలని బైడెన్‌ పిలుపు ఇచ్చారు. ఉక్రెయిన్‌లో ప్రతి భాగాన్ని కాపాడతామన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థను స్థంభింపచేస్తామన్నారు. అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ తరఫున అమెరికా సేనలు యుద్ధం చేయవని తెలిపారు. ఈ ఆదేశాల్లో స్వేచ్ఛా ప్రపంచపు పునాదులను కదిలించేందుకు యత్నించా రని అరోపించారు. నియంతలు దూకుడుగా వ్యవహరించినందుకు మూల్యం చెల్లించిన విషయాలను చరిత్రలో చూశామని, వారు మరింత గందరగోళానికి గురవుతారని అన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతిస్తామని పునరుద్ఘా టించారు. అలాగే ఆర్థిక, సైనిక సహాయాన్ని అందిస్తామని వాగ్దానం చేశారు. అయితే రష్యాను ఎదుర్కొ నేందుకు అమెరికన్‌ దళాలను పంపే ఆలోచనేలేదని అన్నారు. యూరోపియన్‌ యూనియన్‌ బలగాలను పంపనున్నట్లు తెలిపారు. పోలాండ్‌, రుమేనియా, లాట్వియా, లిథుమేనియా, ఎస్టోనియాతో సహా నాటో దేశాలను రక్షించడానికి అమెరికన్‌ సైన్యం, ఎయిర్‌ స్వ్కాడ్రాన్‌లు, ఓడలను సవిూకరిస్తామని అన్నారు. యునైటెడ్‌ స్టేట్స్‌తో పాటు తమ మిత్ర దేశాల ప్రతి అంగుళం భూభాగాన్ని కూడా రక్షించు కునేందుకు యత్నిస్తామని అన్నారు. అది నాటో భూభాగమని, తమ సామూహిక శక్తితో కూడుకున్నదని అన్నారు. రష్యా దాడి ఉద్దేశం ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం, నిర్మూలించడమేనని, అక్కడ మారణహోమం సృష్టిస్తున్నారని అన్నారు. ఉక్రెయిన్‌ను రష్యా బలహీనపర్చలేదని, ఉక్రెయిన్‌పై దాడులకు వ్లాదిమిర్‌ పుతిన్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు దుర్మార్గమని మండిపడ్డారు.ఉక్రెయిన్‌ను రష్యా ముట్టడిరచినా.. ప్రజల మనసులు పుతిన్‌ గెలుచుకోలేరన్నారు. రష్యాలో ఆర్థిక సంక్షోభానికి పుతినే కారణమని జో బైడెన్‌ అన్నారు. కాగా బుధవారం రష్యా, ఉక్రెయిన్‌ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి. తొలి విడత చర్చల్లో ప్రాథమిక డిమాండ్లపై ఇరు దేశాలు పట్టు పట్టాయి. తక్షణమే యుద్దాన్ని విరమించాలని, ప్రత్యేక విధానం ద్వారా తమను ఈయూలో చేర్చాలని ఉక్రెయిన్‌ కోరుతోంది.