ఉక్రెయిన్‌పై దాడి సమర్థనీయం

రష్యా పర్యటనలో ఇమ్రాన్‌ వ్యాఖ్యలు
మాస్కో,ఫిబ్రవరి24(జనం సాక్షి): పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన కుత్సిత బుద్ధిని మరోసారి బయటపెట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఆయన సమర్ధించారు. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ తన యుద్ధోన్మాదాన్ని చాటుకున్నారు. రష్యా` ఉక్రెయిన్‌ యుద్ధం సంతోషాన్ని కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. సరైన సమయంలో రష్యాలో అడుగు పెట్టానని, రష్యా యుద్ధం ఎంతో ఆసక్తిని కలిగిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారింది.
కాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇమ్రాన్‌ ఖాన్‌ బుధవారం రష్యా బయల్దేరారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత ముఖ్య నేత రష్యా వెళ్లడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు, ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఇమ్రాన్‌ చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వేళ ఆయన అక్కడకు వెళ్లడం ఆసక్తి రేపుతోంది. రష్యాకు చైనా, పాక్‌ పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు కొన్ని రోజులుగా సందేహాలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే.