ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు
` కీవ్‌లో క్షపణి దాడులతో భీతావహ వాతావరణం
` పలు నగరాలపై బాంబుల వర్షం
` తీవ్రంగాప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ దళాలు
` 3500 మంది సైన్యాన్ని మట్టుబెట్టామన్న ఉక్రెయిన్
` 14 విమానాలు, 8 హెలికాప్టర్లను కూల్చామని ప్రకటన
` దాడుల్లో 198 మంది పౌరులు మృతిచెందారన్న ఉక్రెయిన్
` కీవ్ తదితర పట్టణాలను స్వాధీనం చేసుకున్న రష్యా
` పుతిన్ చర్చల ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం
` స్వదేశంలో ఉంటూనే పోరాడుతామన్న అద్యక్షుడు
కీవ్,ఫిబ్రవరి 26(జనంసాక్షి): ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతున్నది. బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యన్ బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో దళాలు ప్రవేశించాయి. అయితే ఉక్రెయిన్ బలగాలు ప్రతిఘటించడంతో క్షిపణి దాడులకు పాల్పడుతున్నది. దీంతో కీవ్ దక్షిణ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిళ్లుతున్నది. ఇరు దేశాల సైన్యాల మధ్య భీకర పోరు జరుగుతుండంతో ఆ ప్రాంతంలో భారీగా పేలుళ్లు సంభవిస్తున్నాయి. కాగా, ప్యారా ట్రూపర్స్ సాయంతో రష్యా విమానాన్ని పేల్చేశామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై రష్యా బాంబు వర్షం కొనసాగుతూనే ఉంది. ఆ దేశ రాజధాని కీవ్‌పై బాంబలు మిస్సైల్స్‌తో రష్యన్ దళాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో ఉన్నవారంతా బాంబ్ షెల్టర్స్, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లు, బంకర్‌లలో తలదాచుకుంటున్నారు. కంటివిూద కునుకు లేకుండా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని స్వదేశానికి చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు విదేశాంగ శాఖ సైతం చర్యలను వేగవంతం చేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు 4 ఎయిరిండియా విమానాలను నడుపుతోంది. ఉక్రెయిన్‌లోని 470 మంది భారతీయ విద్యార్థులు భారత్ చేరుకోనున్నారు. ముందుగా భారతీయులను ఉక్రెయిన్ సరిహద్దులైన రొమేనియా, హంగరీ ప్రాంతాలకు తరలించారు. రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకొని ఎయిరిండియా విమానాల్లో భారత్‌కు బయల్దేరనున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకుని రావడానికి ముంబై నుంచి వెళ్లిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకుంది. ఈ విమానం శనివారం సాయంత్రం ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. ఉక్రెయిన్ నుంచి వచ్చే ఈ విద్యార్థులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలుకనున్నారు. మరో రెండు విమనాలను రొమేనియా సరిహద్దు వద్దకు, ఒకటి హంగేరికి పంపనుంది. నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారత పౌరులకు కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. సరిహద్దు పోస్టుల వద్ద ఉన్న భారత అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా ఉక్రెయిన్ సరిహద్దు పోస్టుల వద్దకు వెళ్లవద్దని సూచించింది. వివిధ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. భారతీయ పౌరులనును సమన్వయంతో తరలించడానికి పొరుగు దేశాలలోని భారత రాయబార కార్యాలయాలతో ఎంబసీ నిరంతరం పని చేస్తోంది. అధికారులతో సమన్వయం లేకుండా ఎవరూ సరిహద్దూలకు రావొద్దని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం శనివారం ఉదయం ట్వీట్ చేసింది.
కీవ్ తదితర పట్టణాలను స్వాధీనం చేసుకున్న రష్యా
ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాకు కూడా భారీ నష్టమే జరిగింది. ఇప్పటి వరకు సుమారు 3500 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తన ఫేస్‌బుక్ పేజీలో అప్‌డేట్ చేసింది. మరో 200 మంది రష్యా సైనికుల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. దీనికి తోడు 14 విమానాలను, 8 హెలికాప్టర్లను, 102 యుద్ధ ట్యాంక్‌లను కూడా రష్యా కోల్పోయినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. అయితే ఈ సమాచారాన్ని ఎవరూ ద్రువీకరించలేదు. ప్రస్తుతం జరుగుతున్న దాడిలో మృతులకు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు రష్యా వెల్లడిరచలేదు. రష్యా సైన్యాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని ఉక్రెయిన్ సైన్యం శనివారం ప్రకటించింది. 14 రష్యా యుద్ధ విమానాలను కూల్చేశామని, 102 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని తెలిపింది. సుమారు 3,500 మంది రష్యన్ దురాక్రమణదారులను మట్టుబెట్టినట్లు పేర్కొంది. ఈ ప్రకటనను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. రష్యా గురువారం ఉదయం నుంచి ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో, తమ మిత్ర దేశాల నుంచి ఆయుధాలు, ఇతర పరికరాలు రాబోతున్నట్లు తెలిపారు. యుద్ధ వ్యతిరేక కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అంతకుముందు ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్‌తో మాట్లాడారు. ఇదిలావుండగా, ఉక్రెయిన్‌కు 600 మిలియన్ డాలర్లు సహాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో నాటో స్పందన దళాన్ని యాక్టివేట్ చేశారు. సైన్యం, వాయు సేన, నావికా దళం దీనిలో ఉన్నాయి. నాటో సుప్రీం అల్లయిడ్ కమాండర్ జనరల్ టోడ్ వోల్టర్స్ ఈ దళాన్ని యాక్టివేట్ చేశారు. అయితే నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం లేదు. కాబట్టి ఈ దళం ఆ దేశానికి వెళ్ళడానికి అవకాశం లేదు. మరోవైపు ఉక్రెయిన్ ఆగ్నేయ దిశలోని జపొరిజ్జ్య ప్రాంతంలో ఉన్న మెలిటోపోల్ నగరం తమ వశమైందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఐగోర్ కొనషెంకోవ్ శనివారం చెప్పారు. రష్యన్ సాయుధ దళాలు ఈ నగరంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించినట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత కోసం తమ సైన్యం అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ జాతీయవాదులు, స్పెషల్ సర్వీసెస్ ప్రతిఘటనను తిప్పికొట్టేందుకు కూడా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇకపోతే ఉక్రెయిన్ రాజధాని కీవ్ రష్యా సైనిక చర్యతో విలవిల్లాడుతోంది. ఉక్రెయిన్ సైన్యం మాత్రం వీరోచితంగా ప్రతిఘటిస్తుండగా, రష్యా సైనిక బలగాల బాంబు దాడులతో రాజధాని సహా పలు నగరాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. సైనిక స్థావరాలపైనే తాము దాడులు జరుపుతున్నట్టు రష్యా చెబుతున్నప్పటికీ జనావాసాలను సైతం బాంబులు తాకుతున్నాయి. తాజాగా కీవ్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనాన్ని రష్యా క్షిపణి తాకడంతో ఆ భవనం పూర్తిగా దెబ్బతింది. ఇందుకు సంబంధించి భవంతిలో నివసించే వారే తీసినట్టుగా చెబుతున్న ఒక వీడియో అక్కడి పరిస్థితిని అద్దంపడుతోంది.
స్వదేశంలో ఉంటూనే పోరాడుతామన్న ఉక్రెయిన్ అద్యక్షుడు
రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రతిపాదినలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రష్యాతో శాంతి చర్చలు నిర్వహించేందుకు జెలెన్‌స్కీ అంగీకారం తెలిపినట్లు ప్రెస్ సెక్రటరీ సెర్గే నికిఫరోవ్ తెలిపారు. కాల్పుల విరమణకు కూడా జెలెన్‌స్కీ ఆమోదం తెలిపినట్లు సెర్గే చెప్పారు. చర్చలను తిరస్కరించినట్లు వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని, శాంతి, కాల్పుల విరమరణ ఒప్పందానికి ఉక్రెయిన్ కట్టుబడి ఉందని, ఇదే మా శాశ్వత సిద్దాంతమని, రష్యా అధ్యక్షుడు చేసిన ప్రతిపాదనలను తాము అంగీకరిస్తున్నామని తన ఫేస్‌బుక్ పేజీలో సెర్గే తెలిపారు. అయితే శాంతి చర్చలకు సంబంధించిన స్థలం, తేదీ గురించి సంప్రదింపులు జరుపుతున్నట్లు నికోఫరోవ్ తెలిపారు. చర్చలు ఎంత వేగంగా జరిగితే, అంత త్వరగా సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని ఆయన అన్నారు. మిన్‌స్క్‌లో చర్చలు నిర్వహించాలని రష్యా భావించగా.. వార్సాలో జరిగితే బాగుంటుందని ఉక్రెయిన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అమెరికా ఆఫర్ ఇచ్చింది. మరో దేశానికి తరలించేందుకు అమెరికా ఆయనకు స్నేహహస్తం అందించినట్లు తెలుస్తోంది. కానీ ఆ ఆఫర్‌ను జెలెన్‌స్కీ తిరస్కరించినట్లు ఉక్రెయిన్ విూడియా పేర్కొన్నది. ప్రస్తుతం కీవ్ నగరంలోనే ఉన్నట్లు జెలెన్‌స్కీ తాజా వీడియోలో తెలిపారు. రష్యా దాడి తర్వాత జెలెన్‌స్కీ బంకర్‌లోకి వెళ్లారు. తన స్టాఫ్‌తో కలిసి క్రితం ఓ వీడియోను ఆయన రిలీజ్ చేశారు. అందరం ఇక్కడే ఉన్నామని, ఇక్కడే పోరాడుతామని, తనకు ఆయుధాలు కావాలని వీడియోలో జెలెన్‌స్కీ ప్రకటన చేశారు. దేశాన్ని రక్షించుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు.
రష్యా దాడుల్లో 198 మంది పౌరులు మృతి: ఉక్రెయిన్
ఉక్రెయిన్‌పై దురాక్రమణ మొదలుపెట్టిన రష్యా దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది. గత గురువారం ఈ సైనిక చర్య మొదలవ్వగా.. ప్రస్తుతం రష్యన్ బలగాలు రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తొలుత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామన్ని రష్యా ప్రకటించినప్పటికీ.. సాధారణ పౌరులు, జనావాసాలపైనా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 198 మంది సామాన్య పౌరులు బలైనట్లు ఉక్రెయిన్ తాజాగా వెల్లడిరచింది. ‘‘దురదృష్టవశాత్తూ గత రెండు రోజుల్లో దురాక్రమణదారుల చేతుల్లో 198 మంది పౌరులు బలయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. 1115 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 33 మంది పిల్లలున్నారు’’ అని ఉక్రెయిన్ ఆర్థిక మంత్రి వెల్లడిరచారు. అయితే ఇది కేవలం సామాన్య పౌరుల లెక్క మాత్రమే.. యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులు ఎంతమంది మరణించారన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. నిన్న నల్లసముద్రంలో ఉక్రెయిన్‌కు చెందిన స్నేక్ ద్వీపంలో 13 మంది బోర్డర్ గార్డ్స్ సిబ్బందిని రష్యా చంపేసిన విషయం తెలిసిందే.