ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు

` జపోరిజియాపై బాంబుల మోత 17 మంది మృతి!
కీవ్‌(జనంసాక్షి): ఒకవైపు రష్యా సేనలపై ఉక్రెయిన్‌ బలగాలు పైచేయి సాధిస్తోన్నా.. మరోవైపు ఎడాపెడా దాడులతో పెద్దఎత్తున ప్రాణనష్టం కొనసాగుతూనే ఉంది.
తాజాగా జపోరిజియానగరంపై జరిగిన భీకర క్షిపణి దాడుల్లో 17 మంది మృతి చెందారు. దాదాపు 40కిపైగా తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ ఆదివారం ధ్రువీకరించింది. ‘జపోరిజియా నగరంపై రాత్రి జరిగిన క్షిపణి దాడుల్లో దాదాపు 50కిపైగా అపార్ట్‌మెంట్‌లు, 20 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని జపోరిజియా సిటీ కౌన్సిల్‌ కార్యదర్శి అనటోలీ కుర్తేవ్‌ వెల్లడిరచారు. నాలుగు విద్యాసంస్థలు కూడా ధ్వంసమైనట్లు ఆయన తెలిపారు.ఈ దాడులను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండిరచారు. ‘మరోసారి జపోరిజియాను లక్ష్యంగా చేసుకున్నారు. శాంతియుత ప్రజలపై కనికరం లేకుండా చేపట్టిన దాడులు ఇవి. నివాస భవనాలపై.. అదీ అర్ధరాత్రి వేళలో..’ అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఆరుగురు పిల్లలతోసహా 49 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. దాడులకు పాల్పడిన వారిని దుర్మార్గులు, ఉగ్రవాదులుగా అభివర్ణించారు. ‘ఇది క్రూరమైన చర్య. ఈ దాడులకు అనుమతి ఇచ్చిన వ్యక్తి నుంచి దీన్ని అమలు చేసిన ప్రతి ఒక్కరు.. చట్టం ముందు, ఉక్రెయిన్‌వాసుల ముందు జవాబుదారీగా ఉండాల్సిందే’ అని పేర్కొన్నారు. మరోవైపు.. తమ వద్ద పశ్చిమ దేశాల ఆధునిక క్షిపణి నిరోధక వ్యవస్థలు ఉంటే ఇటువంటి దాడులను అడ్డుకోవచ్చని ఉక్రెయిన్‌ సైన్యం ట్వీట్‌ చేసింది.కాగా మరో వైపు రష్యా`క్రిమియాను కలిపే కెర్చ్‌ రోడ్డు, రైలు వంతెనపై శనివారం ఉదయం పేలుడు చోటు చేసుకున్నది. ఈ దాడిలో ముగ్గురు మరణించారు. అయితే, ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విచారణకు ఆదేశించారు. పేలుడుకు కారణమైన ట్రక్‌ యజమాని దక్షిణ రష్యాలోని క్రాస్నాడర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. శనివారం రైలు, వాహనాల రాకపోకలను నిలిపివేసిన అధికారులు.. తిరిగి ఆదివారం పునరుద్ధరించారు.

తాజావార్తలు