ఉక్రెయిన్ నుంచి క్షేమంగా సొంత జిల్లాకు
31 మంది తిరిగి వచ్చారన్న కలెక్టర్
నెల్లూరు,మార్చి8(జనం సాక్షి): ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు రాష్టాల్రకు చెందిన ఎందరో విద్యార్థులు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలోనే 31 మంది నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థులు క్షేమంగా వారి స్వస్థలాలకు చేరినట్లు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడిరచారు. ఉక్రెయిన్‌లో ఏర్పడిన యుద్ధ వాతావరణం పరిస్థితుల నేపథ్యంలో తమ బిడ్డల పరిస్థితి ఏమిటన్న ఆందోళనతో తల్లడిల్లిన తల్లిదండ్రులకు జిల్లా యంత్రాంగం కొండంత అండగా నిలిచింది. కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు నేతృత్వంలో అధికారులు విద్యార్థులను సురక్షితంగా జిల్లాకు తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్తూ వారి నుంచి అన్ని వివరాలు సేకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమచారం ఇచ్చి విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడంలో జిల్లా యంత్రాంగం అవిరళంగా కృషి చేసింది. విద్యార్థుల క్షేమ సమాచారాన్ని
ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులకు చేరవేస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచి అక్కడున్న మన విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు అధికారులు ఎంతో కృషి చేశారు. సోమవారం నాటికి జిల్లాకు చెందిన మొత్తం విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి జిల్లాలోని వారి స్వస్థలాలకు చేరుకున్నారు. దీంతో వారి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ బిడ్డలను సురక్షితంగా తీసుకువచ్చేందుకు శ్రమించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణతో తామంతా క్షేమంగా ఇంటికి చేరామని విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.