ఉక్రెయిన్‌ బంకర్లలో తలదాచుకున్న విద్యార్థులు

తమను త్వరగా స్వదేశం తీసుకు వెళ్లాలని ట్వీట్లు
విద్యార్థులను రప్పించే యత్నాల్లో కర్నాటక సర్కార్‌
కీవ్‌,ఫిబ్రవరి 26(జనం సాక్షి): రష్యా సైనిక దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌ దేశంలో బంకర్లలో దాక్కున్న తమను రక్షించాలని భారత విద్యార్థులు విన్నవించారు. మేం బంకర్‌లో చిక్కుకుపోయాం. ఆహారం, నీరు,సరైన వెంటిలేషన్‌ కూడా లేదని ఉక్రెయిన్‌లో చిక్కుకున్న బెంగళూరు విద్యార్థులు కొందరు చెప్పారు. తమతో పాటు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన భారతీయులు బంకర్‌లో చిక్కుకున్నారని విద్యార్థి మేఘన శనివారం ఉదయం ట్వీట్‌ చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల వీడియోను కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ శనివారం ట్విట్టర్‌లో పంచుకున్నారు. వారికి తక్షణ సహాయం చేయాలని రాహుల్‌ కోరారు. వీడియోలో బెంగళూరుకు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు తమను వీలైనంత త్వరగా రక్షించాలని భారత ప్రభుత్వానికి, ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని అభ్యర్థించారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న కన్నడిగులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని మరోవైపు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. ఉక్రెయిన్‌లో కర్నాటకకు చెందిన 180 మంది విద్యార్థులు మెడిసిన్‌ తదితర కోర్సులు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. బెంగళూరు, మైసూరు, బళ్లారి, హాసన, ధార్వాడ, విజయపుర, హావేరి, రాయచూరు, దావణగెరె, కల్బుర్గి, బాగల్కోటె, శివమొగ్గ జిల్లాలకు చెందిన వారు అధికంగా ఉక్రెయిన్‌లో వైద్య విద్యాకోర్సులు చేస్తున్నారన్నారు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే వీరిలో చాలా మంది విద్యార్థులు భారత్‌కు తరలివచ్చేందుకు విమాన టికెట్లు కూడా సిద్ధం చేసుకున్నా చివరి క్షణంలో విమాన ప్రయాణాలు రద్దుకావడంతో చిక్కుకుపోయారని సీఎం వివరించారు. ఈ విద్యార్థులంతా సురక్షితంగానే ఉన్నారని చెప్పారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమని గడుపుతున్నట్లు కొందరు విద్యార్థుల కుటుంబీకులకు ఫోన్‌చేసి చెప్పినట్లు తెలిసింది. రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉన్నామన్నారు. తాము ఉంటున్న యూనివర్సిటీ హాస్టల్‌కు కిలోవిూటర్ల
దూరంలోనే బాంబుల మోతతో తీవ్రంగా భయపడ్డామని వెల్లడిరచారు. కాగా ఉక్రెయిన్‌ విద్యార్థుల భద్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ చెప్పారు. ఉక్రెయిన్‌లో రాష్ట్ర విద్యార్థులతో పాటు అక్కడ పనిచేస్తున్న వారి సంఖ్య 200 వరకు ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వైద్య కోర్సులు చేస్తున్న విద్యార్ధుల సంఖ్య 91 వరకు ఉందని జిల్లాల వారీగా వీరి పేర్లు, ఫోన్లు, విద్యనభ్యసిస్తున్న యూనివర్సిటీ తదితర వివరాలను విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందజేశామన్నారు. కాగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యతను అక్కడి రాయబార కార్యాలయం చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు తెలిపార న్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న కన్నడిగులంతా సురక్షితంగా తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మాజీ ప్రధాని దేవెగౌడ ట్వీట్‌ చేశారు. మరోవైపు తమ పిల్లలు ఎలా ఉన్నారో తెలియక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ పిల్లలు సురక్షితంగా తిరిగి రా వాలని కోరుకుంటూ ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.