ఉక్రెయిన్ యుద్దంతో చమురు వదులుతోంది
శ్రీలంకలో భారీగా పెరిగినపెట్రో ధరలు
కొలంబో,ఫిబ్రవరి28 (జనం సాక్షి): రష్యా`ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణ ఉద్రిక్తతల ప్రభావం… అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలపై పడిరది. శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. శ్రీలంకలోని చమురు సంస్థలు పెట్రోల్‌పై రూ.20, డీజిల్ రూ.15లను ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 204 కు చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 139కి పెరిగింది. ఉక్రెయిన్`రష్యా సంక్షోభం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. యుద్ధం ప్రారంభమైన రోజునే దీని ప్రభావం ముడి చమురు ఎగుమతులపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంకకు రష్యా యుద్ధం తీవ్రసమస్యగా మారింది. శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశంలో ఆహార, ఆర్థిక సంక్షోభం నెలకొంది. విదేశీ మారక నిల్వలను ఆదాచేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బ్లాక్ మార్కెట్‌లో బియ్యం, చక్కెర, ఉల్లిపాయలు సహా నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వీటికి తోడు గతేడాది అక్టోబర్‌లో వంట గ్యాస్ ధర సిలిండర్ రూ. 2,657 కు చేరి రికార్డు సృష్టించింది. తాజాగా కరెంట్ కోతలు సైతం విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.