ఉగాదికి మన సినిమా పురస్కారాలు
– మంత్రి తలసాని
హైదరాబాద్,ఫిబ్రవరి 11(జనంసాక్షి): త్వరలో సినిమా అవార్డుల వేడుకను ఏర్పాటు చేస్తామని నంది పురస్కారాలు ప్రదానం చేస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ భేటీలో తలసాని
శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ… నంది అవార్డుల పేరు మార్చే ప్రతిపాదన ఉందని తెలిపారు.2011 నుంచి పెండింగ్‌లో ఉన్న అవార్డులను అందిస్తామన్నారు. సినిమా
షూటింగ్‌లకు సింగిల్ విండో అనుమతులు ఇస్తామని తలసాని స్పష్టం చేశారు. చిత్రపురి కాలనీలో 10 వేల మందికి ఇళ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. థియేటర్లలో రోజుకు 5
సినిమాల అంశాన్ని పరిశీలిస్తున్నామని తలసాని పేర్కొన్నారు. ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావుతోపాటు సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, కేఎస్ రామారావు, రాజేంద్ర ప్రసాద్, అశోక్ కుమార్, ఆర్ నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించిందని తలసాని తెలిపారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు నంది పురస్కారాలను ప్రదానం చేయలేదు. నాటి నుంచి నేటి వరకు పురస్కారాలన్ని ఉగాది రోజున అందజేస్తామని తెలిపారు. చిత్రపురిలో సినీ రంగ కార్మికులకు ఇండ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. చిన్న సినిమాల కోసం ఇకపై సినిమా హాళ్లలో ఐదు షోలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లో టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ఇండియాలో పుణేలో మాత్రమే టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఉందని గుర్తు చేశారు.