ఉగ్రపోరులో పాక్ త్యాగాలను ప్రపంచం గుర్తించాలి: చైనా
బీజింగ్,సెప్టెంబర్8(జనంసాక్షి): తన చిరకాల మిత్రదేశమైన పాకిస్థాన్‌ను చైనా మరోసారి వెనకేసుకొచ్చింది. ఉగ్రవాద నిర్మూలనలో పాక్ బాగా పనిచేస్తోందని కితాబునిచ్చింది. ఆ దేశం తీసుకుంటున్న ఉగ్రవాద నిర్మూలన చర్యలను సమర్థించింది. పాక్ ప్రభుత్వం, ప్రజలు ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఎన్నో త్యాగాలు చేశారు. అవి స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. అంతర్జాతీయ సమాజం దానిని గుర్తించాలి. పాకిస్థాన్‌కు ఆ దిశగా తగిన గుర్తింపు ఇవ్వాలి అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్‌తో భేటీ తర్వాత ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో వాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెలలో కొత్త ఆఫ్ఘనిస్థాన్ విధానాన్ని ఆవిష్కరించిన
సందర్భంగా ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయమివ్వడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. బ్రిక్స్ కూడా ఇదే చెప్పడంతో ఉలిక్కిపడిన పాకిస్థాన్ ఆగమేఘాల విూద చైనాకు పరుగెత్తారు. బ్రిక్స్‌లో సభ్యదేశమైన చైనా ఇప్పుడు మాట మార్చి పాక్‌కు వంతపాడటం గమనార్హం. బ్రిక్స్ దేశాల సదస్సులో తొలిసారిగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల పేర్లను ప్రస్తావిస్తూ తీర్మానం తీసుకొచ్చారు. ఈ తీర్మానంపై చైనా కూడా సంతకం చేసింది. పాకిస్థాన్‌కు చైనా మద్దతిస్తున్న నేపథ్యంలో ఈ తీర్మానంతో ఇరు దేశాల మధ్య బంధానికి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని విశ్లేషకులు భావించారు. అయితే పాక్‌తో తమ స్నేహం ఎప్పటిలాగే ఉంటుందని చైనా స్పష్టంగా చెప్పింది. ‘పాక్‌కు సంబంధించిన వరకు చైనా విధానాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ప్రాంతీయ లక్ష్యాలను ఎదుర్కోవడంలో ఇరుదేశాల మధ్య పరస్పర మద్దతు ఉంటుంది’ అని పాకిస్థాన్‌కు చైనా రాయబారి సున్ వీడాంగ్ అన్నారు. బ్రిక్స్ తీర్మానంలో ప్రస్తావించిన ఉగ్రవాద సంస్థలన్నింటినీ ఇప్పటికే పాక్ నిషేధించిందని పేర్కొన్నారు. మరోవైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉగ్రవాదంపై పోరాడటంలో పాక్ చేసిన త్యాగం చాలా గొప్పది. దీన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదాన్ని తరిమికొట్టడంలో పాక్ కీలక పాత్ర పోషిస్తోంది’ అనిపాక్ విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. పాక్, చైనా ఎప్పటికీ వ్యూహాత్మక భాగస్వాములుగా ఉంటాయని.. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతోందని ఇప్పటికే చైనా చెప్పిన విషయం తెలిసిందే. ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాలని బ్రిక్స్ దేశాలు పిలుపునిచ్చాయి.