ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు

– భారత్‌తో కలిసి పనిచేస్తాం

– పాక్‌ ఉగ్రవాద సంస్థలకు స్వర్గధామంగా మారింది

– అమెరికా విదేశాంగ మంత్రి అటిల్లర్‌సన్‌

న్యూఢిల్లీ,అక్టోబర్‌ 25,(జనంసాక్షి): ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి పనిచేయడానికి అమెరికా కృత నిశ్చయంతో ఉందని ఆదేశ విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌ సన్‌ తెలిపారు. భారత్‌లో పర్యటనకు వచ్చిన టిల్లర్‌సన్‌ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో బుధవారం సమావేశమయ్యారు. పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలు, ప్రాంతీయ భద్రత, ఆప్ఘనిస్తాన్‌లో భారత్‌ పాత్ర తదితర విషయాలను ఉభయులూ చర్చించారు. అనంతరం టిల్లర్సన్‌, సుష్మాస్వరాజ్‌ విూడియా సంయుక్త సమావేశంలో పాల్గొన్నారు. ఇండియా, భారత్‌ సహజ మిత్రదేశాలనీ, ఉగ్రవాదంపై సమష్టి పోరును కొనసాగిస్తామని టిల్లర్‌ సన్‌ తెలిపారు. ఉగ్రవాదాలకు ఆశ్రయమిచ్చే దేశాలను ఉపేక్షించేంది లేదని పాక్‌కు ఆయన చురకలు అంటించారు. పలు ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ స్వర్గధామంగా మారిందని, పాక్‌ ప్రభుత్వ స్థిరత్వాన్ని ఆ ఉగ్రసంస్థలు సవాలు చేస్తున్నాయని అన్నారు.దీర్ఘకాలంలో పాక్‌ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సానుకూల దృక్పథంతో పాక్‌తో పనిచేయాలని తాము కోరుకుంటున్నట్టు టిల్లర్‌ సన్‌ వివరించారు. ఆప్ఘనిస్థాన్‌లో భారత్‌ పాత్రను కూడా టిల్లర్‌సన్‌ ప్రశంసించారు. కాగా ఉగ్రవాదంపై సమష్టి పోరు సాగించే విషయంలో తమ సమావేశంలో మరోసారి దృఢనిశ్చయం వ్యక్తమైందని సుష్మాస్వరాజ్‌ తెలిపారు. హెచ్‌1బీ వీసాలతో యూఎస్‌ఏలో పనిచేస్తున్న భారతీయుల కీలక పాత్రపై కూడా సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే టిల్లర్సన్‌ మంగళవారం పాకిస్థాన్‌ నాయకులతోనూ సమావేశమయ్యారు. పాక్‌లో ఉగ్రకార్యకలాపాలను సాగిస్తున్న టెర్రరిస్టులను మట్టుబెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేయలని పాక్‌ ప్రధాని షాహిద్‌ అబ్బాసీకి సూచించారు. అమెరికా-పాక్‌ మధ్య ద్వైపాక్షిక సహకారం, భాగస్వామ్యం, ఆర్థిక సంబంధాల విస్తరణ తదితర అంశాలపైనా చర్చించారు.