ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

– రక్షణమంత్రితో అమెరికా రక్షణమంత్రి జేమ్స్‌ మాటిస్‌ భేటీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 26,(జనంసాక్షి): భారత్‌- అమెరికాల మధ్య రక్షణ పరంగా పరస్పర సహకారం కోసం పలు ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ సెక్రటరీ జేమ్స్‌ మాటిస్‌తో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఢిల్లీలో చర్చలు జరిపారు. సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై సుధీర్ఘంగా చర్చించామని, ఉగ్రవాదాన్ని ఏ కోణంలోనూ సహించేది లేదన్నారు. ఉగ్రవాద నిర్మూలన కోసం భారత్‌-అమెరికాలు కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌ లో భారత సేనలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని రక్షణ మంత్రి ఖండించారు. అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంగళవారం కలుసుకున్నారు. ఉగ్రసంస్థలకు ఆశ్రయం కల్పించే వారు ఎవరైనా.. వారిని సహించబోమని అమెరికా మంత్రి మాటిస్‌ తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా, భారత్‌ కలిసి పనిచేయనున్నట్లు ఆయన చెప్పారు. రెండు దేశాలపై ఉగ్రవాద ప్రభావం ఉందన్నారు. ఉగ్రవాదం వల్ల ప్రపంచ దేశాలకు ఉన్న ముప్పు తమకు తెలుసు అని మాటిస్‌ తెలిపారు. హిందూ మహాసముద్ర తీరం చుట్టూ భారత్‌ ప్రదర్శిస్తున్న నాయకత్వ లక్షణాలను మాటిస్‌ మెచ్చుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్‌ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు.

అయితే ఆఫ్ఘన్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం ఇస్తామని, కానీ సైనికులు మాత్రం ఎవరూ అక్కడ అడుగుపెట్టరు అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌.. ప్రధాని మోదీ, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ ధోవల్‌ను కలుసుకుంటారు. అంతకముందు అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద మాటిస్‌ పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు.