ఉగ్రవాదాన్ని స్పాన్సర్‌ చేస్తున్నారు

C

– పాక్‌ పరోక్ష విమర్శ

– బ్రిక్స్‌ సర్వసభ్యసమావేశంలో ప్రధాని మోదీ

హాంగ్‌ఝౌ,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): ఉగ్రవాదాన్ని స్పాన్సర్‌ చేస్తూ, మద్దతిస్తున్న శక్తులను ఏకాకిని చేసేందుకు బ్రిక్స్‌ సభ్యదేశాలు కరిసికట్టుగా పోరాటాన్ని తీవ్రతరం చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జి-20 సదస్సుకు ముందు ‘బ్రిక్స్‌’ సభ్యదేశాల సమావేశంలో మోదీ ప్రసంగించారు. బ్రిక్స్‌ సభ్యదేశాలకు చెందిన బ్రెజిల్‌ అధ్యక్షుడు మిచెల్‌ టెమెర్‌, చైనా అద్యక్షుడు జీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్‌ పుతిన్‌, దక్షిణాఫ్రికా అద్యక్షుడు జాకోబ్‌ జుమా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మోదీ అధ్యక్ష ప్రసంగం చేస్తూ, ఉగ్రవాదులకు నిధులు, ఆయుధాలు అందుతున్నాయన్నది చాలా సుస్పష్టమన్నారు. కేవలం ఉగ్రవాదంపై పోరు చేయడమే కాకుండా ఉగ్రవాదానికి మద్దతిస్తూ, నిధులు, ఆయుధాలు సరఫరా చేస్తున్న గ్రూపులను ఒంటరిని చేసేందుకు సభ్యదేశాలన్నీ పరస్పరం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అంతర్జాతీయంగా బలమైన వాణి వినిపించే శక్తిగా బ్రిక్స్‌ ఎదుగుతోందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ లక్ష్యాలను సాధించేందుకు వీలుగా అంతర్జాతీయ అజెండాను తీర్చిదిద్దడంలో బ్రిక్స్‌ కీలక భూమిక పోషించాలన్నారు. గోవాలో వచ్చే నెలలో జరుగనున్న బ్రిక్స్‌ సదస్సుకు నేతలంతా రావాలని తన ప్రసంగం చివర్లో మోదీ ఆహ్వానించారు. అనంతరం బ్రిక్స్‌ సమావేశం వివరాలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ విూడియాకు వివరించారు. ఉగ్రవాదం విసురుతున్న పెను సవాళ్ల గురించి మోదీ ప్రధానంగా ప్రస్తావించారని, కలిసికట్టుగా పోరాటం చేయనిదే ఉగ్రవాదాన్ని చిత్తుచేయడం సాధ్యం కాదని సభ్యదేశాలకు ఆయన సూచించారని చెప్పారు. గోవాలో అక్టోబర్‌ 15-16 తేదీల్లో జరిగే 8వ వార్షిక బ్రిక్స్‌ సదస్సుకు ముందు సభ్యదేశాల నేతలతో ప్రధాని లాంఛనంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుందని వికాస్‌ స్వరూప్‌ అన్నారు.