ఉగ్రవాదులపై బెల్జియం దాడులు

8kzqo7d8 బ్రస్సెల్స్/పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడులు ప్రపంచదేశాలను కుదిపేస్తున్నాయి. దీనిపై యూరప్‌వ్యాప్తంగా అన్ని దేశాలూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బెల్జియం తమ దేశంలో ఉగ్రవాద వ్యతిరేక దాడులను ప్రారంభించింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించినట్లు సమాచారం. ఇక ఫ్రాన్స్, జర్మనీ గత రెండు రోజుల్లో 12 మంది అనుమానితులను అరెస్టు చేశాయి. ఫ్రాన్స్‌లోని వ్యంగ్య పత్రిక చార్లీ హెబ్డో పత్రికపై ఉగ్రవాదులు దాడి చేసి 17 మందిని బలిగొన్న విషయం తెలిసిందే. దీంతో జర్మనీ తదితర దేశాలు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశాయి.

బెల్జియం తమ దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దాడులను చేపట్టింది. శుక్రవారం ఆ దేశ రాజధాని బ్రస్సెల్స్‌కు 125 కిలోమీటర్ల దూరంలోని వెర్‌వయర్స్ పట్టణంలో ముగ్గురు టైస్టులను హతమార్చినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో పేలుళ్లు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్లు పత్రికలు తెలిపాయి. సిరియా నుంచి వచ్చిన ఆ ఉగ్రవాదులు బెల్జియంలో దాడులకు కుట్రపన్నినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయని వెల్లడించాయి. ఇక ఉగ్రవాద దాడులు జరిగిన ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ పోలీసులు గత రెండు రోజులుగా  12 మంది అనుమానితులను అరెస్టు చేశారు.

ఫ్రాన్స్‌లో సైబర్ దాడులు.. ఫ్రాన్స్ ప్రభుత్వం ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. చార్లీ హెబ్డ్పో దాడి జరిగిన తర్వాత గత తొమ్మిది రోజుల్లోనే ఫ్రాన్స్‌కు చెందిన 19 వేల వెబ్‌సైట్లపై హ్యాకర్లు సైబర్ దాడులు జరిగాయి. అందులో చాలా వరకు ఇస్లామిక్ హ్యాకర్ల గ్రూపులే చేశాయని, అయితే పెద్దగా నష్టమేమీ జరగలేదని ఫ్రాన్స్ సైబర్ భద్రత అధికారులు వెల్లడించారు. పారిస్ శివార్లలో కొలంబెస్ పట్టణంలోని ఒక పోస్టాఫీసులో సాయుధ దుండగుడు ఒకరు చొరబడి, ఇద్దరిని బంధించాడు. అతని దగ్గర గ్రెనేడ్‌లు, కలష్నికోవ్ తుపాకులతో పాటు భారీగా మందుగుండు ఉన్నట్లుగా ఆ పోస్టాఫీసు నుంచి తప్పించుకున్నవారు చెప్పారు. అయితే ఈ దుండగుడు ఉగ్రవాది కాకపోవచ్చని భావిస్తున్నారు.