ఉగ్రవాదుల ఊహాచిత్రం విడుదల చేసిన ఎన్‌ఐఏ

4
హైదరాబాద్‌ ఆగస్ట్‌ 18 (జనంసాక్షి):

కశ్మీర్‌లో ప్రాణాలతో పట్టుబడ్డ ఉగ్రవాది నవేద్‌తో పాటు భారత్‌లోకి ప్రవేశించిన మరో ఇద్దరు ఉగ్రవాదుల వూహా చిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మంగళవారం విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఉగ్రవాదులు దాడులు జరపగా, అందులో ఓ ఉగ్రవాది నవేద్‌ భారత సైన్యానికి ప్రాణాలతో పట్టుబడ్డ విషయం తెలిసిందే. పాక్‌కు చెందిన నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారత్‌లో ప్రవేశించారు. వీరిలో నవేద్‌, మహ్మద్‌ నోమన్‌ అనే ఇద్దరు ఉధంపూర్‌లో దాడులు జరిపారు. ఈ ఘటనలో నోమన్‌ చనిపోగా నవేద్‌ ప్రాణాలతో పట్టుబడ్డాడు. మరో ఇద్దరు జాగ్రమ్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌, అబు ఓక్షా అనే ఉగ్రవాదులు పరారీలో ఉన్నారు. అయితే నవేద్‌ను నిన్న దిల్లీ కోర్టులో విచారించారు. నవేద్‌ తెలిపిన వివరాల ప్రకారం పరారీలో ఉన్న ఉగ్రవాదుల వూహా చిత్రాలను ఎన్‌ఐఏ అధికారులు నేడు విడుదల చేశారు. వారిని పట్టించిన వారికి రూ. 10లక్షల రివార్డును కూడా ప్రకటించారు. ఈ ఉగ్రవాదులంతా పాక్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.ఇది ఇలా ఉండగా  జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌ ఉగ్రవాద ఘటనలో ప్రాణాలతో పట్టుబడ్డ లష్కరే ఉగ్రవాది నవేద్‌కు లై డిటెక్టర్‌ టెస్ట్‌ పూర్తయింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఒక్కో విధంగా సమాధానాలు చెప్పడంతో నవేద్‌ను లై డిటెక్టర్‌ ద్వారా పరీక్షించాలని సోమవారం దిల్లీ కోర్టు ఆదేశించింది. అత్యంత భద్రత మధ్య మంగళవారం నవేద్‌ను దిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీకి తరలించారు. అక్కడ నవేద్‌కు లై డిటెక్టర్‌ పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష నివేదిక ఇంకా రాలేదని అధికారులు వెల్లడించారు.