ఉగ్రవాద నిర్మూలనకు ఉమ్మడి ఎజెండా
ప్రపంచ దేశాలు కలసికట్టు పోరు సాగించాలి
న్యూఢల్లీి,ఆగస్ట్5(జనంసాక్షి): ప్రపంచ ఉగ్రవాద నిర్మూలన అన్నది ఏ ఒక్క దేశం పనో కాదని గుర్తించాలి. దీనిని ఉమ్మడిగా ఎదర్కోవాలి. ఇటీవల ఆల్‌ఖైదా అగ్రనేత అల్ జవహరి హతమైనా ఇంతటితో ఇది సమసి పోయిందనడానికి లేదు. ఇంకా ప్రతి దేశమూ ఉగ్రవాద ముప్పును ఎదర్కొంటూనే ఉంది దేశాలన్నీ ఉగ్రమూకలను చెండాడే క్రమంలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలి. ఉగ్రవాద నిరోధక చట్టాలను సవిూక్షించి, వాటికి మరిన్ని కోరలు తొడిగే పని చేయాలి. ఉగ్రవాదులు మూకుమ్మడిగా ఆయుధాలతో దాడి చేయడం ఒకప్పటి పద్ధతి. ఇప్పుడు దాని రూపం మారింది. గుంపు దాడి స్థానే ఏక వ్యక్తి తరహా దాడులను అది అనుసరిస్తున్నది. దీనికి పెద్ద నెట్‌వర్కు ఏవిూ అవసరం వుండదు. ఇంటర్నెట్ వుంటే చాలు. తనకు తాను చావడానికి సిద్ధమైనవారు ఆత్మాహుతి బాంబర్లుగా మారతారు. వీరి లక్ష్యాలు జనం రద్దీ ఎక్కువగా వుండే రైల్వేస్టేషన్లు, సబ్‌వేలు, మార్కెట్లు, ఎరీనాలే. ఈ తరహా ఉగ్రవాదం నేడు మానవాళికి ఒక సవాలుగా మారింది. డబ్బు, అధునాతన టెక్నాలజీ, మానవ వనరులను మరింతగా వెచ్చిస్తే ఉగ్రవాదం పీచమణచేయడం ఏమంత కష్టం కాదని ప్రధాని మోడీ మరికొందరు ప్రపంచ నేతలు వాదిస్తుంటారు. ఈ రకమైన విధానంతో ఉగ్రవాదాన్ని ఓడిరచిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా కానరావు. అపారమైన మానవ వనరులు వృథా కావడం తప్ప. ఉగ్రవాదానికి ఆజ్యం పోసే విధానాలొకవైపు అనుసరిస్తూ, మరో వైపు ఉగ్రవాదం అంతుచూస్తామని ప్రగల్భాలు పలకడం పాలకుల ద్వంద్వ ప్రవృత్తికి
నిదర్శనం. ఉగ్రవాదాలు మానవాళికి ప్రమాదకరమైనవే. ఐసిస్‌ను బూచిగా చూపి అమెరికా, పశ్చిమ దేశాల దుర్మార్గాలకు ప్రతీకారం పేరుతో ఐసిస్ దాడులకు దిగుతున్నాయి. చివరికి ఇదొక విషవలయంగా మారిపోయింది. అంతిమంగా దీనికి సమిధలవుతున్నది అమాయక ప్రజానీకం. ఈ విషవలయాన్ని ఛేదించాలి. ఉగ్రదాడుల ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటే వాతావరణంపై అంతర్జాతీయ స్థాయిలో చొరవ చూపినట్లుగానే, ఉగ్రవాదంపైనా ఐరాస చొరవ చూపాలి. ప్రజల మధ్య విద్వేషాలు, అపోహలు, అపనమ్మకాలు పెంచే విచ్ఛిన్నకర పోకడల స్థానే పరస్పర విశ్వాసం, సౌభ్రాతృత్వం ఆలంబనగా అందరూ ఒక్కటేనన్న భావన ప్రజల్లో పెంపొందించాలి. సహనం, పరస్పర గౌరవం వంటి విలువలకు పట్టం గట్టాలి. ఈ మార్గం విడిచిపెట్టి ఉగ్రవాదంపై పోరు పేరుతో తమకు గిట్టని దేశాలపైన దాడులు చేయడం, వాటి సార్వభౌమత్వాలను కాలరాయడం వంటి దుస్సాహసిక చర్యలను కొనసాగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు. ఇఆ చేస్తూ పోతే మరింతగా ఊతమిచ్చిన వారం అవుతాం.