ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించండి
న్యూయార్క్,జనవరి24(జనంసాక్షి): పాకిస్థాన్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గట్టి హితబోధ చేశారు. ఉగ్రవాదంపై ఆదేశం చర్యలు తీసుకోగలదని, ఆ పని చేసి తీరాలని
స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్యూ ఇచ్చిన సందర్భంగా పాక్ లో ఉగ్రవాదం అంశంపై ఈ విధంగా స్పందించారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ తన దేశం నుంచి కూకటి వేళ్లతో పీకేయాలని, సమూలంగా ధ్వంసం చేయాలని, దాని నెట్ వర్క్ మొత్తాన్ని చిన్నాభిన్నం చేసి నాశనం చేయాలని చెప్పారు. ఈ నెల(జనవరి) 2న భారత వైమానిక స్థావరం పఠాన్ కోట్ పై దాడి విషయంలో ఆయన స్పందన కోరగా భారత్ చాలాకాలంగా ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్యకు ఇది మరొక తాజా ఉదాహరణ అని అన్నారు. ఈ దాడి అనంతరం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను దర్యాప్తు ఒప్పించడంలో ప్రధాని మోదీ విజయవంతమయ్యారని కొనియాడారు. అదే సమయంలో ఇరు నేతలు కూడా ఏ మాత్రం తొందరపడకుండా ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంలో షరీఫ్, మోదీల మధ్య మాటలు చాలాముందుకు వెళ్లాయని ఇది గొప్పవిషయం అని చెప్పారు. భారత్‌తో తమ స్నేహసంబంధాలనేవి సుదీర్ఘమైనవని, మరింత గొప్పగా అభివృద్ధి చేసుకుంటామని పునరుద్ఘాటించారు. అమెరికా కూడా భారత్ ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్యనే ఎదుర్కొంటుందని, దాన్ని నిలువరించేందుకు భారత్‌తో కూడా కలిసి పనిచేస్తామని చెప్పారు. ఉగ్రవాద సంస్థలపై చర్యలను పాక్ తమ ప్రాంతం నుంచే మొదలుపెట్టాలని
సూచించారు. ఉగ్రవాదుల అరాచకత్వాన్ని అణిచివేసేందుకు పాక్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రముఖ విూడియా సంస్థ పీటీఐకి ఆదివారం వాషింగ్టన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఇటీవల జరిగిన దాడిని గురించి ప్రస్తావించారు. ప్రాణాలకు తెగించి.. దేశం కోసం పోరాడి ప్రాణాలొదిలిన పఠాన్‌కోట్ సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని ఒబామా అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పఠాన్‌కోట్ దాడి తర్వాత మోదీ, నవాజ్ షరీఫ్ సంప్రదింపులు అభినందనీయమన్నారు. మతాలతో సంబంధం లేకుండా ప్రజాహక్కులు, ఆత్మగౌరవానికి బలమైన గొంతుకగా భారత్ నిలిచిందన్నారు. ఆసియా పసిఫిక్, హిందూ సముద్రం ప్రాంతంలో స్థిరత్వం, భద్రతకు భారత్ కృషి చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. భారత్‌లో వాణిజ్యాన్ని సులభతరం చేసిన మోదీ చర్యలను స్వాగతిస్తున్నట్లు ఒబామా అన్నారు. భారత్-అమెరికా సంబంధాల బలోపేతానికి ఇరుదేశాలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఒబామా అభిప్రాయపడ్డారు.