ఉచితంగా ఇండ్ల పట్టాలు ఇవ్వాలి

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామ రైతు వేదిక భవనంలో సర్పంచ్ బూడిద మల్లేష్ అధ్యక్షతన 59 జీవో, గృహ లక్ష్మీ పథకం అంశాలపై రెవెన్యూ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. 59 జీవో గురించి గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిలో గత 60 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న మాకు ఉచితంగా ఇండ్ల పట్టాలు ఇవ్వాలి.. కానీ ప్రభుత్వమే నోటీసులు పంపించి మమ్మల్ని డబ్బులు చెల్లించమనటం బాధాకరంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలు కూడా ఇదే సర్వే నెంబర్లలో ఇండ్లు మంజూరు చేసిందని గతంలో లేనిది ఇప్పుడు ప్రజలపై పెను భారం మోపడం తగదని గత ముఖ్యమంత్రులు కూడా భూమితో పాటు ఇండ్లు ఉచితంగా మంజూరు చేశారని కానీ ప్రస్తుతం ప్రభుత్వం పేద ప్రజల ఇండ్ల స్థలాలపై స్లాబ్ల వారీగా మార్కెట్ ధరలు నిర్ణయించి రికవరీకి రెవెన్యూ అధికారులను జెసిబిలతో కూల్చుటకు ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. భవిష్యత్తులో ఇట్లాంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని జాగా ఉన్న వారికే ఇండ్లు ఇస్తే జాగా లేని పేదవారి పరిస్థితి ఏంటని గ్రామస్తులు ప్రశ్నించారు. తక్షణమే 59 జీవో ప్రకారం అర్హులైన మాకు ఉచితంగా ఇండ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఇంకా రెవెన్యూ భూముల సమస్యలు ఉన్నాయని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. గృహ లక్ష్మీ పథకంలో ఇంటి స్థలం పట్టా ఉన్నవారికి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా ఉందని భూమి ఉండి పట్టా లేని నిరుపేదలకు కూడా ఇల్లు కట్టుకునే విధంగా పథకంలో మార్పులు చేకూర్చాలని ప్రభుత్వానికి సూచించారు. జీవో 59 డిమాండ్ నోటీసు ప్రకారం మేము డబ్బులు చెల్లించలేమని గ్రామ సభలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందిజరిగింది. గ్రామసభకు గైర్హాజరైన రెవెన్యూ అధికారులపై గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు, ఇట్టి కార్యక్రమంలో వార్డు సభ్యులు దాసరి తార, తోకల శైలజ, బూడిద జైపాల్, చిప్ప సమ్మక్క, పంచాయతీ కార్యదర్శి పల్లె అనిల్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.