ఉత్తరభారతంలో పోటెత్తిన వరదలు
– జనజీవనం అతలాకుతలం
న్యూఢిల్లీ,ఆగస్టు 21(జనంసాక్షి):భారీ వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో.. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, రాజస్థాన్ అతలాకుతలం అవుతున్నాయి.భారీ వర్షాలకి మధ్యప్రదేశ్ లోని సిప్రా నదికి వరద నీరు పోటెత్తింది. దాంతో ఆధ్యాత్మిక పట్టణం ఉజ్జయినీ మొత్తం నీట మునిగింది. ఆలయాలు సైతం నీటిలో మునిగాయి. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భోపాల్ లో ప్రమాదం తప్పింది. కలియసోట్ నదిలో చేపలు పడుతుండగా.. ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దాంతో ముగ్గురు యువకులు నీటిలో గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు తాళ్ల సాయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.వరదలపై మధ్యప్రదేశ్ సర్కార్ అధికారులను అప్రమత్తమం చేసింది. ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది.. వేలాది మంది ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. రిలీఫ్ కేంద్రాల్లో బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రాంతాలకు వెళ్లిన ఆయన్ని సిబ్బంది చేతుల విూద ఎత్తుకొని తీసుకెళ్లారు.ఉత్తరాఖండ్ లో సహాయక చర్యలపై సీఎం హరీష్ రావత్ సవిూక్ష నిర్వహించారు. స్వయంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. బాధితులకు అండగా ఉంటామని హావిూనిచ్చారు.బిహార్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏరియల్ సర్వే చేశారు. భారీ వర్షాలకు సోనే నదికి వరద పోటెత్తిందని, ఇంద్రపురి బ్యారేజీ నుంచి ఎక్కువగా నీరు వదలడంతో ముంపు సమస్య తలెత్తిందని ఆయన చెప్పారు. బన్ సాగర్ డ్యాం నుంచి విడుదల చేసిన నీరు కూడా సోనే నదికి త్వరలో చేరుతుందని, దీనివల్ల ముంపు సమస్య కొనసాగుతుందని నితీష్ వివరించారు. గండక్, కోసి నదుల్లో వరద అదుపులోనే ఉందన్నారు.




