ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం

కేదార్‌నాథ్‌లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు

న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌లలో గత మూడు రోజులుగా భారీగా మంచుకురుస్తోంది. ఉష్ణోగ్రతలు మైనస్‌ 5 డిగ్రీలు దిగువకు నమోదవుతున్నాయి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి సందర్భంగా కేదార్‌నాథ్‌ రానున్నారు. అయితే ఇక్కడ కురుస్తున్న భారీ మంచుకారణంగా ప్రధాని రాకకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లు నిలిచిపోయాయి. నవంబరు తొలివారంలోనే ఇక్కడ మంచు ఇలా పేరుకుపోవడం ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు. రాబోయే 24 గంటల్లో బలమైన గాలులు కూడా వీస్తాయనివాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలావుంటే ప్రధాని నరేంద్ర మోదీ.. ఈసారి దీపావళి వేడుకను కేదార్‌నాథ్‌లో జరుపుకోనున్నారు. ఈనెల 7వ తేదీన మోదీ దీపావళి సందర్భంగా కేదారీశ్వరుడిని సందర్శించుకోనున్నారు. అక్కడ ఉదయం 9.15 నిమిషాల నుంచి 11.15 నిమిషాల వరకు ఉండనున్నారు. ఆ సమయంలో కేదార్‌నాథుడికి మోదీ పూజలు చేయనున్నారు. ఆ తర్వాత కేదార్‌నాథ్‌ పునర్‌ నిర్మాణ పనులను ఆయన సవిూక్షించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఇప్పటికే కేదార్‌నాథ్‌కు ఎస్‌పీజీ టీమ్‌ చేరుకున్నారు. అక్కడ కావాల్సిన భద్రతా ఏర్పాట్లను వారు పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంలో మోదీ కేదార్‌నాథ్‌కు వెళ్లడం ఇది మూడవ సారి అవుతుంది. కేదార్‌నాథ్‌ను సంపూర్ణంగా శుభ్రపరచాలన్న ఉద్దేశంతో ప్రధాని ఉన్నారు. 2013లో వచ్చిన వరదల తర్వాత కేదార్‌నాథ్‌ పూర్తిగా దెబ్బతిన్నది. మందాకినీ, సరస్వతి నదులపై నిర్మించిన బ్రిడ్జ్‌లను మోదీ పరిశీలించ నున్నారు.