ఉత్తరాఖండ్‌లో రావత్‌ బలపరీక్షకు కేంద్రం ఓకే

న్యూఢిల్లీ,మే6(జ‌నంసాక్షి):  ఉత్తరాఖండ్‌ రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతూ,  తెరపడే అవకాశాలున్నాయి. సుప్రీం ఆదేశాలతో అసెంబ్లీలో బలనిరూపణకు కేంద్రం అంగీకరించింది. అయితే బలపరీక్షకు సంబంధించిన కీలక నిర్ణయాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఎప్పుడు బలనిరూపణ పరీక్ష జరుగుతుందన్న విషయాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయలేదు. సుప్రీంకోర్టులో ఈ అంశంపై అటార్నీ జనరల్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బలపరీక్షకు అబ్జర్వర్‌ను నియమించాలని ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు. పదవీ విరమణ చేసిన చీఫ్‌ ఎన్నికల కవిూషనర్‌ను అబ్జర్వర్‌గా నియమించాలని సుప్రీంకోర్టును అటార్నీ జనరల్‌ కోరారు. రెండు మూడు రోజుల్లో బలనిరూపణ విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు ఏజీ తెలిపారు. మే 10వ తేదీన బలనిరూపణ జరుగుతుందని ప్రాథమికంగా తెలుస్తోంది.  ఉత్తరాఖండ్‌ శాసనసభలో హరీశ్‌ రావత్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నెల 10న తన బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ రోజు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొద్ది సేపు అమలు జరగదని తెలిపింది. బల పరీక్ష సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. అనర్హత వేటు పడిన తొమ్మిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఈ విశ్వాస పరీక్షలో ఓటు వేయడానికి వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విశ్వాస పరీక్షను ఈ నెల 10న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించాలని, ఆ సమయంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు జరగదని పేర్కొంది. సభా పరీక్ష నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి ఈ నెల 10తో తెర పడే అవకాశం ఉంది.