ఉత్తరాదిని వణికిస్తున్న చలి

tourists_stsnowfallన్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఉత్తర భారతాన్ని చలి వణికిస్తున్నది.దాదాపు అన్ని రాష్ర్టాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జమ్మూకశ్మీర్ రాష్ట్రం అంతటా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నది. లడఖ్ ప్రాంతంలోని కార్గిల్‌లో శనివారం రాత్రి అత్యధికంగా మైనస్ 9.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. లేహ్‌లో మైనస్ 9.4, పర్యాటక ప్రాంతం గుల్‌మర్గ్‌లో మైనస్ 4.6, పహల్గమ్‌లో మైనస్ 2.9, శ్రీనగర్‌లో మైనస్ 2.2డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కశ్మీర్‌లో సుదీర్ఘ చలి రాత్రులు(చిలాయ్-కలాన్) ప్రారంభమయ్యాయి.

డిసెంబర్ 21 నుంచి జనవరి 31వరకు చిలాయ్-కలాన్ కొనసాగనుంది. ఈ కాలంలో మంచు కురిసే స్థాయికి ఉష్ణోగ్రతలు తరుచూ పడిపోతుంటాయి. మరోవైపు ఈ సీజన్‌లో తొలిసారిగా ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాలలో ఆదివారం మంచు కురిసింది. 25ఏండ్ల తర్వాత క్రిస్మస్ పండుగ రోజున హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు కురిసిందని అధికారులు తెలిపారు. కినోర్ జిల్లా కల్ప ప్రాంతంలో 7సెం.మీ.ల మంచు పేరుకుపోయింది. కుప్రిలో 2సెం.మీ., నర్ఖందలో 5సెం.మీ.ల మంచు కురిసింది. ఉత్తరఖండ్ రాష్ట్రంలోని చమోలి, రుద్రప్రయాగ, ఉత్తరకాశీ జిల్లాలతోపాటు బద్రీనాథ్, కేదర్‌నాథ్ తదితర ప్రాంతాలలో ఈ సీజన్‌లోనే తొలిసారిగా మంచుకురిసింది. దేశ రాజధాని ఢిల్లీలో సాధారణ ఉష్ణోగ్రత 11.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దట్టమైన పొగమంచు కారణంగా 103 రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తుండగా మరో 27రైళ్ల షెడ్యుల్‌ను మార్చారు.