ఉత్తరాది అతలాకుతలం
– గుజరాత్‌లో 70కి చేరిన మృతుల సంఖ్య
– ఉత్తరాఖండ్‌లో తెగిపోయిన వంతెనలు
న్యూఢిల్లీ, 26 జూన్ (జనంసాక్షి):
ఉత్తరాదిలో వర్షాలు హడలెత్తిస్తున్నాయి. గుజరాత్, కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాశ్మీర్‌లో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇక గుజరాత్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 70 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్‌లోని అమ్రేలీ ప్రాంతంలోనే ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది. అమ్రేలీలోనే అత్యధికంగా 26మంది మృత్యువాత పడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా మందాకినీ నదిపై ఉన్న విఠల్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఈ బ్రిడ్జి ద్వారానే భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుంటారు. బ్రిడ్జి భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలకు ఆటంకమేర్పడిందని అధికారులు తెలిపారు. మరో 48గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, కొండచరియలు విరిగి పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలతో దాదాపు 400మంది భక్తులు చిక్కుకుపోయారని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక గంగానది కూడా ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది.