ఉత్తర కొరియాకు ఐక్యరాజ్యసమితి వార్నింగ్

8హైడ్రోజన్ బాంబును పరీక్షించిన ఉత్తర కొరియాను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా హెచ్చరించింది. ఆ దేశంపై తక్షణం కఠిన ఆంక్షలను అమలులోకి తీసుకురానున్నట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెల్లడించింది. హైడ్రోజన్ బాంబు పరీక్షను ఖండించిన యూఎన్ ఆ ప్రయోగం వల్ల అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు కలిగిందని అభిప్రాయపడింది. నాలుగు సార్లు అణు పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా మొదటిసారి హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటన చేయగానే భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఆ సమావేశానికి హాజరయ్యాయి. ఉత్తర కొరియాపై తాజా ఆంక్షలను అమలు చేయనున్నట్లు భద్రతా మండలి అధ్యక్షుడు ఎల్బీ రోసెల్లి తెలిపారు. ఐక్యరాజ్యసమితి నియమావళిని ఉల్లంఘించిన కారణంగా ఉత్తర కొరియాపై సరికొత్త ఆంక్షలను తీసుకొచ్చేందుకు భద్రతా మండలి త్వరలో తీర్మానం చేయనున్నట్లు ఆయన చెప్పారు.