ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం విజయవంతం

5
– ఉలిక్కిపడిన ఐక్యరాజసమితి

హైదరాబాద్‌,ఫిబ్రవరి 7(జనంసాక్షి): ప్రపంచ దేశాలకు ఉత్తర కొరియా మళ్లీ షాకిచ్చింది. ఆ దేశం ఆదివారం నింగిలోకి రాకెట్‌ను పేల్చి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే ఉత్తర కొరియా ప్రకటనను మాత్రం ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఆ దేశం క్షిపణిని ప్రయోగించిందని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర కొరియా ప్రకటనతో ఉలిక్కిపడ్డ ఐక్యరాజ్య సమితి తక్షణమే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సుదీర్ఘ దూరం ప్రయాణించే క్షిపణిని కొరియా ప్రయోగించి ఉంటుందని అమెరికా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ అంశంపై చర్చించేందుకు దక్షిణ కొరియా, జపాన్‌, అమెరికా దేశాలు వెంటనే సమావేశం కావాలని నిర్ణయించాయి. జనవరిలో హైడ్రోజన్‌ బాంబును పరీక్షించిన ఉత్తర కొరియా ఇప్పుడు రాకెట్‌ను ప్రయోగించి అగ్రదేశాలకు దడ పుట్టిస్తుంది. ఐరాస ఆంక్షలను ఉత్తర కొరియా ఉల్లంఘించిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. క్వాంగ్‌మ్యాంగ్సాంగ్‌-4 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఉత్తర కొరియా ఇవాళ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. స్పష్టమైన వినీలాకాశంలోకి సెగలు చిమ్ముకుంటూ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లినట్లు కొరియా ఆ ప్రకటనలో పేర్కొంది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఉపగ్రహాం కక్ష్యలోకి చేరుకున్నట్లు వెల్లడించింది. ఉత్తర పొంగ్యాన్‌ రాష్ట్రంలోని సోహీ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్‌ను ప్రయోగించారు. రోదసి కార్యక్రమం శాంతియుతంగా సాగిందని స్థానిక విూడియా పేర్కొంది. దేశాధినేత కిమ్‌ జాన్‌ ఉన్‌ ఆదేశాల మేరకే ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు విూడియా తెలిపింది. అయితే ఉత్తర కొరియా ప్రయోగాన్ని దక్షిణ కొరియా తప్పుపట్టింది. పొరుగు దేశం ఉపగ్రహాన్ని ప్రయోగించలేదని అది ఖండాంతర క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా ఆరోపించింది. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి బరువు సుమారు 200 కిలోలు ఉంటుందని దక్షిణ కొరియా అంచనా వేస్తుంది. ఉత్తర కొరియా మరోసారి అణు పరీక్షకు సిద్ధమవుతుందని దక్షిణ కొరియా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగించరాదని ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు విధించింది. కానీ ఆ దేశం పదేపదే వాటిని ఉల్లంఘిస్తుంది. దీంతో తూర్పు ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.