ఉత్తర తెలంగాణ ఎడారే..

నేతల పాపం.. బాబ్లీ శాపం
ముంబయి దారులు మూసుకుపోయాయి
బావుల్లో కొలువులు లేవు
దుబాయిలో ఉన్నోళ్లే జైళ్లో
హైదరాబాద్‌, మార్చి 1 (జనంసాక్షి) :
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర భూభాగంలో ఆ రాష్ట్రం ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీని పూర్తి చేసుకోవచ్చంటూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో ఉత్తర తెలంగాణ ఎడారిగా మారనుంది. ఐదు జిల్లాలకు తాగు, సాగునీరందించే ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌లో నిర్మిస్తున్న బాబ్లీ వల్ల వర్షాభావ పరిస్థితుల్లో ఎస్సారెస్పీలోకి చుక్క నీరు వచ్చే అవకాశాలు లేవు. దీంతో ప్రాజెక్టుపైనే ఆధారపడిన నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లోని పొలాలు బీడు బారనున్నాయి. ఈ జిల్లాల ప్రజలకు ఎస్సారెస్పీ నీరే ఆధారం. ఇప్పుడది రాకుంటే వారికి ఆత్మహత్యలే గతి. ముంబయి వలసబోయి బతుకుదామంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. అటువైపు దారులన్నీ మూసుకుపోయాయి. బొగ్గుబాయిల్లో కొలువుల భర్తీ నిలిచిపోయి దశాబ్దాలు దాటింది. డిపెండెంట్లకే ఉద్యోగాలు గతిలేవు కొత్తోళ్లకు ఉద్యోగాలిచ్చే అవకాశాలు అసలే లేవు. అప్పోసప్పో చేసి దుబాయికి పోయన్న బతుకుదామంటే విజిటింగ్‌ వీసాలని చెప్పి ఆడున్నోళ్లనే జైళ్లలో పెడుతుండ్రు. ఈ పరిస్థితుల్లో ఉత్తర తెలంగాణ ఎడారిగా మారి ఇక్కడి ప్రజలు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయి. బాబ్లీ నిర్మాణం ఆపాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరైన వాదనలు వినిపించడంలో విఫలమైంది. పాలకులు చేసిన పాపమే రైతులు, ప్రజలకు శాపంగా మారింది. శ్రీరామ్‌సాగర్‌ కింద 16లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతోంది. బాబ్లీతో శ్రీరాంసాగర్‌ ఎండిపోతే వేలాది మంది రైతులు, ఆయకట్టుపై ఆధారపడ్డ వ్యవసాయ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. దీంతో కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, నిజామాబాద్‌, తదితర జిల్లాల్లో రైతులు గుండె ధైర్యాన్ని కోల్పోతున్నారు. అంతర్జాతీయ జల నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ప్రాజెక్టు నిర్మించినా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలను సరిగ్గా విన్పించలేక పోయింది. మహారాష్ట్ర ప్రభుత్వం చాలా తెలివిగా తాగునీటి అవసరాల కోసమే బాబ్లీని నిర్మించినట్టుగా సుప్రీంకోర్టును మెప్పించగలిగింది. అయితే మహారాష్ట్ర కుటిల ఆలోచనతోనే సాగునీటి కోసమే ప్రాజెక్టును నిర్మించిందనే విషయాన్ని సుప్రీంకోర్టు ముందు నిరూపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దీనివల్లే ఈ పరిస్థితి నెలకొంది. మహారాష్ట్ర మొండిధైర్యంతో నిర్మించిన ప్రాజెక్టును కూలదోయరనే నమ్మకంతోనే ఈ దుస్సాహసానికి ఒడిగట్టింది. గతంలో సుప్రీంకోర్టులో బాబ్లీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించింది. సానుకూలంగా స్పందించింది. అందులో భాగం గానే బాబ్లీకి గేట్లు పెట్టకూడదని తీర్పు చెప్పినా ఆ తీర్పును తుంగలో తొక్కి ఆ రాష్ట్ర ప్రభుత్వం గేట్లను బిగించింది. కోర్టు అనుమతిస్తేనే ఈ గేట్లను తెరుస్తామని వంచనతో సుప్రీంకు హామీ ఇచ్చింది. అయితే ప్రాజెక్టు పూర్తయిన తరువాత మహారాష్ట్ర తన వాదనను మార్చివేసింది. అయితే కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మనరాష్ట్ర ప్రజల తరఫున నిలబడేందుకు వెనుకడుగు వేసింది. అక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఈ విషయంలో కేంద్రం ప్రేక్షక పాత్ర పోషించింది. ఎనిమిదేళ్లుగా బాబ్లీ ప్రాజెక్టులోకి నీరు రావడం ఆగిపోయింది. మహారాష్ట్రలో గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షపాతం అంతగా నమోదు కాకపోవడంతో గోదావరిలోకి వచ్చే వరద తగ్గిపోయింది. దీంతో వచ్చిన కొద్దిపాటి నీరు కూడా బాబ్లీ ప్రాజెక్టు వరకే సరిపోవడంతో కిందకు ఒక్క చుక్క నీటిని మహరాష్ట్ర ప్రభుత్వం వదలడం లేదు. దీంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి నీరు రావడం కష్టమైంది. ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టు కూడా ఎడారిగా మారుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చట్టబద్ధత రావడంతో శ్రీరాంసాగర్‌కు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకున్న పీవీ నరసింహారావు కంతనపల్లి ప్రాజెక్టు వృథాగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉన్న శ్రీరాంసాగర్‌ ఎండిపోయే పరిస్థితులుంటే దానికి అనుబంధంగా ఉన్న ప్రాజెక్టుల నుంచి నీరు రావడం ఇక కలే. బాబ్లీ ప్రాజెక్టు అవసరాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు పలు కొత్త కోణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. 1957లో గోదావరి నదిపై నిజామాబాద్‌ పట్టణానికి సమీపంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును నిర్మించారు. అయితే ఈ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌లోనే బాబ్లీని వారధిగా నిర్మించారు. దారికోసం అంటే ఎవరూ అడ్డుపడరనే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ వారధినే ప్రాజెక్టుగా మార్చేశారు. అయితే మహారాష్ట్ర భూభాగంలోనే ఈ ప్రాజెక్టును నీరు నిల్వ చేసే విధంగా మార్చివేసి దానికి గేట్లు బిగించారు. అయితే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోని 0.68 టిఎంసిల నీటిని మహారాష్ట్ర తాగునీటి కోసం వాడుకుంటోంది. ఈ నీటిని వాడుకునే హక్కు ఉండడాటన్ని ఆసరాగా తీసుకుని ఏకంగా 62 గేట్లను అమర్చారు. అయితే ఈ గేట్లను బిగించే సమయంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సరైన వాదనలు విన్పించి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదని పలువురు సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాగునీటి పేరు చెప్పి సాగునీటి కోసమే వారు కుట్ర చేసినా దాన్ని నిలిపివేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విఫలమైందని చెప్పాలి. తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో ఉన్న 16లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇక నీరు దొరికేది కష్టమే. ఎస్‌ఆర్‌ఎస్‌పి మొదట 227 టిఎంసిల నీరు నిల్వ ఉండేలా నిర్మించారు. అనంతరం మహారాష్ట్ర పరిధిలో ముంపు తీవ్రత అధికంగా ఉండడంతో దీన్ని 90టిఎంసిలకే పరిమితం చేశారు. ఇప్పుడు మహరాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గర్భంలోనే బాబ్లీని నిర్మించడంతో దీని సామర్థ్యం కూడా ఇప్పుడు మరింత తక్కువైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పరివాహక ప్రాంతం అంతా మహరాష్ట్రలోనే ఉండడంతో బాబ్లీని దాటి ఎస్‌ఆర్‌ఎస్‌పి లోకి నీరు వచ్చే అవకాశం కన్పించడంలేదు. బాబ్లీ కన్నా శ్రీరాంసాగర్‌ దాదాపు 17 అడుగుల ఎత్తు ఉండడంతో శ్రీరాంసాగర్‌లోకి నీటి ఒత్తిడికి బాబ్లీ గేట్లు రివర్స్‌గా తెరుచుకుని నీరు వెనక్కుపోయే ప్రమాదం కూడా ఉందని తాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మనరాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఉదాశీనత, అసమర్ధత వల్లే మహరాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన బాబ్లీకి చట్టబద్దత సాధించిందనే విమర్శలు మాత్రం బలంగా విన్పిస్తున్నాయి.