ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

1
విశాఖపట్నం,జులై 9 (జనంసాక్షి):

బంగ్లాదేశ్‌, పశ్చిమ బంగా తీరాలను ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడితే వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. మరోవైపు గత రెండు రోజులులగా ఉష్ణోగ్రతల్లో కొంత మార్పు కనిపిస్తోంది.అల్పపీడనానికి అనుబంధంగా కదులుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోవిూటర్ల ఎత్తులో ఉంది. రెండు, మూడు రోజులు స్థిరంగా కొనసాగితే అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల వాతావరణంలో మార్పులొచ్చి ప్రస్తుతం బలహీనంగా ఉన్న రుతుపవనాలు చురుగ్గా పనిచేస్తాయని చెప్పారు. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో గురువారం పశ్చిమ బంగా, ఒడిశా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరకోస్తాలోనూ గురువారం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఈ మూడు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గవచ్చని తెలియజేసింది. దక్షిణ కోస్తాపై అల్పపీడనం ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉండకపోవచ్చు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం అక్కడికే పరిమితమై క్రమంగా బలహీనపడితే రెండు తెలుగు రాషాల్లోనూ ప్రస్తుత వాతావరణమే మరికొన్ని రోజులపాటు కొనసాగుతుందన్నారు. అల్పపీడన ప్రభావంతో ఒడిశా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణశాఖ వెల్లడించింది. అదేవిధంగా ఏపీలోని ఉత్తరకోస్తాలోని పలుప్రాంతాల్లో నేడు అక్కడక్కడ వానలు పడే అవకాశం. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం అక్కడికే పరిమితమైతే తెలంగాణ, ఏపీలో ప్రస్తుత వాతావరణమే కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. కాగా చినుకు జాడకోసం విత్తనాలు వేసిన రైతుల ఎదురు చూపులు కొనసాగుతున్నాయి.