ఉత్సవ విగ్రహంలా దేవాదాయశాఖ 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తరవాత దేవాలయ భూములకు విముక్తి కలుగుతుందని అంతా భావించారు. అన్యాక్రాంతం అయిన, కౌలుదార్ల కబంధహస్తాల్లో ఉన్న భూములను స్వాధీనం చేసు కుంటారని భావించారు. సిఎం కెసిఆర్‌ కూడా గంటెడు భూమి కూడా పరాధీనం కానీయమని అన్నారు. వక్ఫ్‌,దేవాదాయ భూములను స్వాధీనం చేసుకుని వాటిని దేవాలయాల కింద అభివృద్ది చేస్తామని ప్రకటించారు. ఇటీవల భూసర్వే సందర్భంగా కూడా అదే విసయం ప్రకటించినా అమల్లో మాత్రం ఎక్కడా కానలేదు. అర్చక సంఘాలు కూడా పప్పు బెల్లాలకు ఆశపడుతూ వస్తున్నారే తప్ప గట్టిగా గ్రామాల్లో ఉన్న భూములకు విముక్తి కల్పించాలని కోరడంలేదు. కొన్నిచోట్ల పూజారులు కూడా భూములను స్వాహా చేసిన ఘటనలు ఉన్నాయి. ఆక్రమణ దారులనుంచి భూములను స్వాధీనం చేసుకుంటే ఆలయ ధూపదీప నైవేద్యా నికి ఢోకా ఉండదు. అలాగే ఆలాయాల ఆదాయం కూడా పెరిగి గ్రామాల్లో మంచి వాతావరణం కూడా వస్తుంది.  అయితే మొన్నటి భూ సర్వేలో దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల భూముల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు.  ఇటీవల చేపట్టిన భూసర్వేలో భాగంగా ఆలయాల భూముల వివరాలు కూడా సేకరించాలని అధికారులను ఆదేశించింది. దేవాదాయ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులతో అనుసంధానంగా భూముల లెక్కలు పక్కాగా తీసేందుకు కార్యాచరణ చేపట్టామని అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో భూరికార్డుల శుద్ధీకరణ కార్యక్రమంగా పూర్తయినా ఏ గ్రామంలో ఎంతెంత భూమి తేలిందో చెప్పలేదు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కానీ, కమిషనర్‌ కానీ భూముల అన్యాక్రాంతం పై పెద్దగా శ్రద్ద పెట్టిన దాఖలాలు లేవు. జిల్లాల్లో ఉన్న పలు ఆలయాల పరిధిలో భూములు ఉన్నప్పటికీ వాటికి పరిరక్షణ కరువయింది.  ఈ క్రమంలోనే ఆలయాలకు చెందిన భూముల వివరాలు సేకరించి, పరిరక్షించేందుకు జిల్లా అధికారులు పకడ్బందీగా ముందుకెళ్తున్నామని చెప్పినా ఆచరణలో మాత్రం నీరు గార్చారు. భూములకు హద్దులు నిర్ణయించి, దేవుళ్ల పేరుతో రికార్డుల్లో నమోదు చేసి, కంప్యూటరీకరించడం ద్వారా ఆస్తుల పరిరక్షణ చేస్తే బాగుండేది. అలాగే దేవాలయం పేరువిూదే పాస్‌బుక్‌లు రూపొందించాల్సి ఉంది. గతంలో ఓ మారు  హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్వహించిన సవిూక్షా సమావేశంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ నిర్ణయంతో కబ్జాదారుల్లో వణుకు పుడుతుందనుకున్నా అలాంటిదేవిూ జరగలేదు.  ఇన్నాళ్లూ నిరాదరణకు గురైన అనేక అలయాలకు ప్రభుత్వ కార్యాచరణతో పూర్వ వైభవం వస్తుందని పలువురు అనుకున్నారు. భూముల ఆదాయంతో ధూపదీప నైవేద్యాలతో ఆలయాలు వెలుగొందుతాయని ఆశాభావం వ్యక్తం చేసారు. దేవాదాయ శాఖ పరిధిలో అనేక ఆలయాలు ఉన్నాయి. పదమూడు మండలాల్లోనూ ఆలయాలు, వాటికి సంబంధించిన వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. అయితే అవి రికార్డుల్లో మాత్రం భద్రంగా ఉన్నాయి.. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆలయాల భూములన్నీ ఆగమాగమయ్యాయి. పలు ఆలయాలు భూములు అన్యాక్రాంతమయ్యాయి. మరికొన్ని ఆలయాల భూములను పలువురు కౌలుకు తీసుకుని పంటలు పండించుకుంటున్నారు  కానీ కౌలు మాత్రం చెల్లించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇవే అక్రమాలపై స్థానికుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చినా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, నిజానికి చాలా వరకు భూ రికార్డులు కూడా సరిగ్గా లేవనే విమర్శలు కూడా వినిపి స్తున్నాయి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల భూములు ఎన్ని? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి..? కబ్జాకు గురైనవి ఎన్ని? కౌలుకు ఇచ్చినవి ఎన్నెకరాలు? కౌలు రూపంలో వస్తున్న ఆదాయం ఎంత?
తదితర వివరాలన్నింటినీ అధికారులు సేకరించి ఉంటే బాగుండేది. రెవన్యూ భూ రికార్డుల సందర్భంగా ఈ భూములను గుర్తించి అక్రమ ఆక్రమణ దారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని అనేక ప్రాంతాల్లో ప్రజలు కోరారు. ఉదాహరణకు జనగామ జిల్లా బచ్చన్నపేట  శ్రీచెన్నకేశవ ఆలయానికి చెందిన భూములను తక్షణం స్వాధీనం చేసుకోవాలని గ్రామస్థులు, వంశపారంపర్య ధర్మకర్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నా చర్య తీసుకున్న దాఖలాలు లేవు.  గతంలో స్థానకంగా ఉన్న ఓ మావో మిలిటెంట్‌ పూజార్లుగా ఉన్న ధర్మకర్తలను బెదిరించి కౌలుదార్లకు మద్దతుగా నిలిచాడని ప్రచారంలో ఉంది. దీంతో కౌలుదార్లు నక్సల్‌ అండతో ఆ భూములను తమ స్వాధీనంలోనే ఉంచుకుని దేవాలయానికి కౌలు కట్టడం మానేశారు. దీంతో ఆలయ పర్యవేక్షణ కొరవడింది. ఇప్పటికీ ఆ మిలిటెంట్‌ బెదరింపుల కారణంగానే ఎవరు కూడా భూముల జోలికి పోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అతనికి రాజకీయంగా కూడా అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నారు. దీంతో ఈ భూములను స్వాధీనం చేసుకున్న వారు రికార్డులను తారుమారు చేసే ప్రమాదం ఉంది. ఇలా అనేక దేవాలయ పరిధిలో ఉన్న భూములకు ఇప్పుడు మార్కెట్లో బాగా రేట్లు పలుకుతున్నాయి. దీనిని ఆసరాగా రికార్డులు తారుమారు చేసి ఆలయ భూములను అమ్ముకునే ప్రమాదం ఉంది. దేవాదాయశాఖ, మంత్రి, అర్చక సంఘాలు ఇప్పుడు దీనిపై దృష్టి పెట్టాలి. అంతేగాని పప్పు బెల్లాల కోసం కాదు. సంఘాలు తమ గ్రామాలల్లో ఉన్న దేవాలయాలతో పాటు, భూముల వివరాలను ప్రభుత్వానికి సమర్పించ పోరాడాలి. అప్పుడే వారికి చిత్తశుద్ది ఉందని అనుకోవచ్చు. ఈ భూములు స్వాధీనం చేసుకుంటే ఇక ధూపదీప నైవేద్యాల కోసం ప్రభుత్వం చుట్టూ తిరగాల్సిన అవసరం రాకపోవచ్చు. దేవాదాయశాఖ కూడా కఠినంగా వ్యవహరిస్తే వేలాదిఎకరాల భూములు స్వాధీనం కావడంతో పాటు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతుంది.