ఉద్యమంలో అసాంఘీక శక్తులు
– తుని ఘటనపై పవన్ విచారం
హైదరాబాద్,ఫిబ్రవరి 1(జనంసాక్షి): తుని ఘటన వెనక అసాంఘిక శక్తుల ప్రయమేయం ఉందన్న అనుమానం ఉందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వానికి మద్దుతగా ఆయన కీలక వ్యాఖ్యలుచేశారు. కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్రవేశించడం వల్లే ఉద్యమం హింసాత్మకంగా మారిందన్నారు. కేరళలో షూటింగ్ రద్దుచేసుకుని వచ్చిన పవన్ సోమవారం హైదరాబాద్‌లో విూడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కాపు గర్జన’ ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.చౌరీ చోరీ ఘటన మూలంగా దేశ స్వాతంత్య్ర ఉద్యమం పాతకేళ్ల పాటు వెనక్కి వెళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఎన్నో కుల ఉద్యమాలు జరిగినా ఇంత హింస చెలరేగలేదని పవన్ ఆ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కాపుగర్జన సందర్బంగా ప్రభుత్వం సరైన ముందు జాగ్రత్తలు తీసుకోలేదని, ఇప్పటికైనా కాపు నేతలతో సంప్రదింపులు జరిపి పరిస్థితి చేయి దాటకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.తుని ఘటన తనకు బాధ కలిగించిందన్నారు. ఉద్యమాలు శాంతియుతంగా జరగాలని ఆకాంక్షించారు. కాపు గర్జన సమావేశం సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల వెనుక తప్పకుండా అసాంఘిక శక్తులు ఉన్నాయని తెలిపారు. సభకు వచ్చిన వారు చేసింది కాదన్నారు. ఏదో అగ్గిపుల్ల గీసి వేస్తే రైలు కాలిపోదని అన్నారు. రైలును దగ్దం చేయడం చిన్న విషయం కాదన్నారు. దీని వెనుక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటేనే రైలు దగ్దం వంటివి జరుగుతాయన్నారు. ప్రొఫెషనల్స్ మాత్రమే ఇలాంటివి చేయగలరని తెలిపారు. ఉద్యమాలు నడిపే నాయకులు ముందు చూపుతో ఆలోచించకుంటే ఇలాంటివే జరుగుతాయన్నారు. నాయకులు సమస్యను పరిష్కరించాలే తప్ప భావోద్వేగాలను రెచ్చగొట్టరాదన్నారు. అసలు ప్రభుత్వం కూడా లక్ష మంది జనం వస్తుంటే ఎందుకు జాగ్రత్త తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించాల్సింది అని అన్నారు. కుల ఉద్యమాలను హ్యాండిల్ చేయడంలో ప్రభుత్వానికి ముందు చూపులేదన్నారు. రిజర్వేషన్లు ఒక్క రోజులో వచ్చేవి కాదన్నారు. ఏ ఉద్యమమైనా శాంతియుతంగా జరగాలన్నారు. కాపుల డిమాండ్ ఈనాటిది కాదని తెలిపారు. కాపు రిజర్వేషన్లపై అనేక ప్రభుత్వాలు హావిూలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
అనేక తెగలు కలిస్తే కాపులు అని వివరించారు. తెలంగాణలో కాపులు బీసీ జాబితాలో ఉన్నారని, రాయలసీమ, ఏపీలో ఓసీలో ఉన్నారని తెలిపారు. నేతలు తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని కాపులు భావిస్తున్నారని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చుతామని అందరూ చెప్పారని గుర్తు చేశారు. కమిషన్లతో పనులు కావని కాపులు భావిస్తున్నారని తెలిపారు. కాపులకు నమ్మకం కలిగించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించకుంటే మరిన్ని ఉద్యమాలు వస్తాయన్నారు. అందరితో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించాలని సూచించారు. బీసీలకు ఇబ్బందులు లేకుడా రిజర్వేషన్లు
అమలు చేయాలని సూచించారు. ఈ సంఘటనపై ప్రభుత్వం న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా బీసీలకు అన్యాయం జరుగకుండా కాపులకు న్యాయం చేస్తుందా లేదా తెలపండని అన్నారు. చేయలేక పోతే చేయలేమని చెప్పండని సూచించారు. ఏదో ఒకటి చెప్పకుంటే ప్రమాదకర పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలు ముందుకు
రావాలని విజ్ఞప్తి చేశారు. అయితే కాపులను బీసీలో చేర్చాలన్న డిమాండ్ ను విూరు సమర్ధిస్తారా అన్న ప్రశ్నకు మాత్రం పవన్ సూటిగా సమాధానం చెప్పలేదు. కులం కోసం కాదు ప్రజల కోసం ఉద్యమిస్తానంటూ సమాధానాన్ని దాట వేశారు. ఈ సమస్యను రాజకీయం చేయడం తనకిష్టం లేదంటూ వ్యాఖ్యానించారు. దీనికి తోడు కాపులలో ఏదో భయం పట్టుకుందని పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఉద్యమ నాయకులు బాధ్యతతో వహించాలని హితవు పలకడం విశేషం. మనుషుల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యవహరించకూడని, తుని ఉద్యమం హింసాత్మకంగా పరిణమించడం దురదృష్టకరమ న్నారు. కాపుల డిమాండ్ ఇప్పటిదికాదని.. అనేక దశాబ్దాలుగా ఉందన్నారు. ఏ సమస్య అయినా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో తప్పు లేదు. కానీ శాంతియుతంగా ఉండాలి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఉద్యమాలు ఉంటాయి గానీ శాంతియుతంగా ఉంటాయన్నారు. చిన్న ఆడియో వేడుకకే అనేక అనుమతులు తాము తీసుకుంటామని, అలాంటిది లక్షలమంది ఒకచోటకి చేరితే పోలీసులు, ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అలాగే ఉద్యమాలు చేపట్టే నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ అన్నారు. నాయకులు హక్కులు సాధించుకోవాలి తప్ప భావోద్వేగాలను రెచ్చగొట్టకూడదని హితవు పలికారు. ఉద్యమాన్ని నడిపే నాయకులు ఆ స్ఫూర్తి తప్పుదారి పట్టకుండా చూసుకోవాలని, చౌరీ చౌరా ఘటనలో హింస వల్ల స్వాతంత్రోద్యమం 25 ఏళ్లు ఆలస్యమైందన్నారు.
తాను ఒక కులం కోసం పోరాడటం లేదని, జాతి సమగ్రతను కోరుకునేవాడినని పవన్ పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యతిరేక పద్ధతుల్లో పోరాటాలు వద్దని అంబేడ్కర్ చెప్పారన్నారు. ఈ సమస్యకు తాను మధ్యవర్తిత్వం వహిస్తే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లు అవుతుందని అన్నారు. ఇకపోతే హెచ్‌సీయూ పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన తనకు చాలా బాధ కలిగించిందని పవన్ విచారం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో కులవ్యవస్థ ఎప్పటినుంచో ఉందని, తాను చదువుకునేటప్పుడు ఇలాంటి ఘటనలు చాలా చూశానన్నారు. రోహిత్ ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే దానిపై తాను మాట్లాడబోనని పేర్కొన్నారు.