ఉద్యమానికి నేను నాయకత్వం.. ఆరాచకం వెనుక బాబు హస్తం

3

– త్వరలో ఆమరణ దీక్ష

– ముద్రగడ పద్మనాభం

కాకినాడ,ఫిబ్రవరి 1(జనంసాక్షి): కాపు రిజర్వేషన్ల కోసం తాము శాంతియుత ఉద్యమం చేయాలనే తలపెట్టామని, అయితే ఉద్యమంలోకి కొన్ని దుష్టశక్తులు చొరబడి రైలును, పోలీసు జీపులను, బస్సులను తగలబెట్టాయని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో విూడియాతో మాట్లాడారు. ఈ దుష్టశక్తులకు శిక్షణ ఇప్పించింది, ఇక్కడకు పంపింది ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలేనని ఆయన స్పష్టం చేశారు.  నాలుగైదు రోజుల్లో తాను, తన శ్రీమతి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తామని ప్రకటించారు. తమను అరెస్టు చేసినా బెయిల్‌ కోసం దరఖాస్తు చేయబోమని, జైల్లో కూడా దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. తమ దీక్షకు మద్దతుగా ఎవరూ కిర్లంపూడి రావొద్దని, ఎవరికి వాళ్లు తమ ఇళ్లలోనే నిరాహార దీక్ష చేయాలని కోరారు. ఇప్పటికే ఉద్యమంలోకి దుష్టశక్తులను ప్రవేశపెట్టినందువల్ల.. వాటితో ఇంకా ఎన్ని దారుణాలు చేయిస్తారోననే అనుమానంతో తాను అప్పటికప్పుడు ఉద్యమం తప్పుదోవ పట్టకూడదన్న ఉద్దేశంతో ఆపానని, వేరే కార్యాచరణ కోసం సమాలోచనలు కొనసాగుతున్నాయని పద్మనాభం తెలిపారు. దీన్ని ఆకలితో కూడుకున్న ఆఖరి ఉద్యమంగా చేస్తున్నానన్నారు. రిజర్వేషన్‌ పొందేవరకు తన జీవితాన్ని తన జాతికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు. నాలుగైదు రోజుల్లో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి తాను, తన భార్య సిద్ధమయ్యామని, అయితే ఈలోపే తమను ఏదో వంకతో అరెస్టు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. తాను పారిపోయేది గానీ.. బెయిల్‌ తెచ్చుకునే ప్రసక్తి గానీ లేదని స్పష్టం చేశారు. జైల్లో పెట్టినా అక్కడ కూడా ఆమరణ దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. తన దీక్షకు మద్దతుగా ఎవరూ కిర్లంపూడి రావొద్దని చెప్పారు. ఎవరికి వాళ్లు ఎక్కడికక్కడే నిరాహార దీక్షలు చేయాలని, ఇళ్ల ముందు కంచం విూద ఓ గంట సేపు గరిటెతో కొట్టాలని కోరారు. తుని వద్ద జరిగిన ఉద్యమంలో.. తమ కార్యకర్తల కారు అద్దాలను కూడా పగలగొట్టారని, ప్రభుత్వం మాత్రం మాటిమాటికీ ఈ నేరాన్ని బయటివాళ్ల విూదకు తోస్తోందని చెప్పారు. ఈ సమావేశం తేదీ ప్రకటించినప్పటి నుంచి కూడా తమ సమావేశానికి ఎదురుదాడి చేయించారని, ఎన్నోరకాలుగా ప్రకటనలు ఇప్పించారని అన్నారు. తమ కుల సోదరులతో ఉద్యమాన్ని నీరుకార్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. ఆఖరికి కొన్నిచోట్ల రౌడీలతో సమావేశాలు పెట్టించారని ఆయన చెప్పారు. ఆ సమావేశాలకు వెళ్లాలని, అక్కడ గొడవలు చేయాలని, కాపులతో దెబ్బలు తిని.. వాళ్లు ఇతరులను కొడతారనిపించుకోవాలంటూ  ట్రైనింగ్‌ ఇచ్చారని సమాచారం ఉందని ఆయన తెలిపారు. ఈ ఉద్యమానికి ఎవరో చేయూతనిస్తున్నారని, ఎవరికో తాను, ఈ జాతి అమ్ముడైపోయినట్లు ప్రకటనలు చేయడం బాధాకరమని ముద్రగడ అన్నారు. తమది అమ్ముడైపోయే జాతి అని, తాను అమ్ముడయ్యే మనిషినని టీడీపీ పెద్దలు వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా తాను ఉద్యమాలు చేసినప్పుడు తనను ఎన్ని వందల కోట్లకు కొన్నారని సూటిగా ప్రశ్నించారు. మేం ఎవరికీ వ్యతిరేకం, అనుకూలం కాదన్నారు.   ఉద్యమం ఏ మతానికి, కులానికి, పార్టీకి వ్యతిరేకంగా చేయట్లేదని, ఏ పార్టీకీ అనుకూలం కూడా కాదని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తమ ఆకలి బాధ తీర్చాలనే అడుగుతున్నామని.. సీఎం ఆశపెట్టడం వల్లే, తాము రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఆయన ఆ మాట ఇవ్వకపోతే ఇంత పెద్ద విూటింగ్‌ పెట్టేవాళ్లం కామని, అది తప్పించుకోడానికి కమిషన్ల విూద కమిషన్లు వేయడం న్యాయం కాదని ఆయనకు ఐదు నెలల క్రితం ఉత్తరం రాస్తే ఇప్పటి వరకు స్పందన, సమాధానం లేవన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కావాలని మహ్మద్‌ జానీ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఉత్తరం రాస్తే, మూడు నెలల్లో నివేదిక తెప్పించుకుని రిజర్వేషన్లు కల్పించారన్నారు. అదే తమకు మాత్రం ఏడాదికి వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఈ ప్రభుత్వం భిక్షం వేసినట్లు 50 కోట్లు, వందకోట్లు ఇచ్చి ఈ జాతిని అవమానిస్తోందని మండిపడ్డారు. తునిలో జరిగిన ఘటనల విూద విచారణలో విూరు పురమాయించిన మనుషుల పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడతారని, అది తమకు తెలుసని ముద్రగడ అన్నారు. దుష్టశక్తులకు నాయకత్వం వహించింది విూ పార్టీ నాయకులేనని.. అయినా ఇప్పుడు కేసులు పెట్టాలంటే తన విూద పెట్టాలి తప్ప తనవాళ్ల విూద వద్దని కోరారు. విూడియా విూద, పోలీసుల విూద దాడి చేయొద్దని ముందునుంచే తాను అందరికీ చెప్పానని.. కానీ కొన్ని పత్రికల వాళ్లు సొంత ఎజెండాతో వచ్చి, వంకర రాతలు రాస్తుంటే వాటికి తాను ఎలా బాధ్యత వహిస్తానని ప్రశ్నించారు. వాళ్లు తమ వాహనాల విూదే దాడులు చేశారని.. దాడులు చేయాలని తానెప్పుడూ ట్రైనింగ్‌ ఇవ్వబోనని, ఇచ్చినవాళ్లు వేరే ఉన్నారని తెలిపారు. వారం రోజుల నుంచి మనసు బాగా బాధపడుతోందని, సమావేశం దగ్గర్లో అన్నం వండుకునే స్థలం ఎవరైనా ఇస్తుంటే కూడా తోలు తీసేస్తామని పోలీసులు వాళ్లను బెదిరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తే, రేపు ఏం చేస్తారోనన్న భయంతో కార్యాచరణను ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామని, నష్టం జరగకూడదనే శాంతియుత పద్ధతిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నారు.

జీతాలకు డబ్బులేవంటూ జలసాలా?

జీతాలకు డబ్బు లేని మనిషి పట్టిసీమకు 1400 కోట్లు, రాజధాని శంకుస్థాపనకు 400-500 కోట్లు ఖర్చుపెట్టారని, ప్రత్యేక విమానాల్లో జిల్లాలకు, విదేశాలకు తిరుగుతున్నారని ముద్రగడ ఎద్దేవా చేశారు. వాట్టనింటికీ డబ్బులున్నాయి గానీ, తమ జాతికి ఇవ్వాలంటే డబ్బులు లేవంటున్నారని మండిపడ్డారు. ముందు హావిూ ఇచ్చిన డబ్బు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తమను కర్వేపాకు కంటే దారుణంగా వాడుకుంటున్నారన్నారు. తన జీవితం అయిపోయేలోపు జాతికి ఏమైనా చేయాలని తలపెడితే.. ప్రభుత్వ పెద్దలు దాన్ని ఇలా వమ్ము చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన చావు తర్వాతైనా రిజర్వేషన్‌ ఇచ్చి తీరాలని ఆవేదన వ్యక్తం చేశారు.  కాపులను బీసీల్లోకి చేర్చడం ఏళ్ల తరబడి జాప్యం మంచిది కాదన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. కాపుల విషయంపై చంద్రబాబు హావిూ ఇచ్చారని,దానిని అమలు చేయాలని కోరుతున్నామని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. అయితే  కాపులను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అన్నారు. కాపు జాతిలో పుట్టడం నేరమా అన్నది తేల్చుకోవడానికి తాను రోడ్డు,రైల్‌ రోకోకి వెళ్లామని అన్నారు. తుని గర్జన సమయంలో జరిగిన ఘటనల నేపద్యంలో తాను రాస్తారకో ,రైల్‌ రోకో విరమించానని ముద్రగడ చెప్పారు. తునిలో కాపుగర్జన అనంతరం జరిగిన దమనకాండ వెనుక రౌడీలు ఉన్నారన్న ఆరోపణలను ముద్రగడ పద్మనాభం కొట్టిపారేశారు. ఆ భావనను క్రియేట్‌ చేశారని ఆయన విమర్శించారు.  తునిలో జరిగిన సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని, రాష్ట్రం చంద్రబాబు జాగీరా అని ముద్రగడ ప్రశ్నించారు. ఇచ్చిన హావిూలను నెరవేర్చేందుకు నిధులు లేవంటున్నారు, చంద్రబాబు మాత్రం విమానాల్లో ఎక్కి తిరుగుతున్నారని ఆయన విమర్శించారు.