ఉద్యమాలతోనే తెలంగాణ సాధన : నాగం

నిజామాబాద్‌, నవంబర్‌ 12  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఉద్యమాలతోనే తెలంగాణ వస్తుందని భరోసాతో తెలంగాణ నగార అధ్యక్షుడు నాగం జనార్ధన్‌రెడ్డి చేపట్టిన బస్సుయాత్రను జిల్లాలో విజయవంతం చేయాలని బస్సుయాత్ర కో-ఆర్డినేటర్‌ రామ్‌రాజు జిల్లా నాయకులు వసంత్‌రెడ్డి, శ్రీహరి తదితరులు కోరారు. సోమవారం టీఎన్జీఓస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 23 నుంచి రాజకీయ పార్టీలకు అతీతంగా మహబూబ్‌నగర్‌లో బస్సుయాత్ర ప్రారంభమవుతుందని నిజామాబాద్‌కు 26న చేరుకుంటుందన్నారు. జిల్లాలోని భిక్కనూర్‌ మండలం బస్వాపూర్‌వద్ద ప్రారంభమయి భిక్కనూర్‌, కామారెడ్డికి చేరుకుంటుందన్నారు. మరుసటిరోజు ఇందల్వాయి, డిచ్‌పల్లి, నిజామాబాద్‌, జాన్కంపేట, నవీపేట మీదుగా ఆదిలాబాద్‌జిల్లాలో ప్రవేశిస్తుందన్నారు. ఈసందర్బంగా 27న జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో జెఎసి నాయకులు గోపాల్‌శర్మ, గైని గంగారాం, కిషన్‌, తదితరులు పాల్గొన్నారు.