ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కారు: సుజాత

ఆదిలాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను వ్యతిరేకంగా నిరంకుశ పాలన సాగించిన తెరాసకు చరమగీతం పాడాలని కాంగ్రెస్‌ ఎమ్యెల్యే అభ్యర్థి గండ్రత్‌ సుజాత పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్లలో దొరల పాలన సాగుతోందన్నారు. ప్రజలను పట్టించుకోని ప్రభుత్వానికి పాతరేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌ రూరల్‌ గ్రామా/-లో కార్యకర్తలు, నాయకులతో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏం అభివృద్ది చేశారని డబ్బా కొట్టుకుంటున్నారని అన్నారు. పేదల పెన్నిధిగా నిలిచిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందని, ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్న రామన్న మొక్కలు నాటకుండా నిధులు దుర్వినియోగం చేశారని, ఉన్న చెట్లను నరికి జోరుగా కలప స్మగ్లింగ్‌ చేయించారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను సైతం వదలకుండా ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పీజీ కళాశాలతో పాటు యూనివర్సిటీ, టెక్స్‌టైల్స్‌ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తాన్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు.