ఉద్యమ నెలబాలుడు.. పద్మవ్యూహంలో అభిమన్యుడు..
– ఢిల్లీలో 30 రోజులుగా రైతుల విరోచితపోరాటం
దిల్లీ,డిసెంబరు 25 (జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాలపై అన్నదాతలు పట్టువీడట్లేదు.. రద్దుకు ప్రభుత్వం దిగిరావట్లేదు.. ఫలితంగా 30వ రోజూ హస్తిన సరిహద్దుల్లో రైతన్నల ఆందోళన కొనసాగుతోంది. ఎముకల కొరికే చలిని కూడా లెక్కచేయకుండా గత నెల రోజులుగా రైతులు ఉద్యమం సాగిస్తూనే ఉన్నారు. చట్టాలను రద్దు చేసేదాకా ఇక్కడి నుంచి కదలబోమని అన్నదాతలు ఘంటాపథంగా చెబుతుంటే.. రద్దు వద్దు.. చర్చిద్దామని ప్రభుత్వం అంటోంది. దీంతో నెల రోజులు గడుస్తున్నా ప్రతిష్టంభన వీడట్లేదు. దిల్లీ-హరియాణాలోని సింఘు, టిక్రీ రహదారులపై వేలాది మంది రైతులు బైఠాయించి శాంతియుతంగా నిరసన సాగిస్తున్నారు. అటు చిల్లా, ఘాజిపూర్ సరిహద్దుల్లోనూ అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. దీంతో ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దిల్లీకి వచ్చేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కాగా.. రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం మరోసారి ఆహ్వానించింది. అయితే ఎజెండాలో కనీస మద్దతు ధర అంశాన్ని చేర్చవద్దని స్పష్టం చేసింది. దీంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. మద్దత ధరకు చట్టబద్ధమైన హవిూని సాధించుకోవడం తమ ఉద్యమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని వెల్లడించారు. ఈ అంశం చర్చల్లో ఉండాల్సిందేనని అన్నారు. ప్రభుత్వ ఆహ్వానంపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సింఘు సరిహద్దులో రైతు సంఘాల నాయకులు సమావేశం కానున్నారు. తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా.. రైతు సంఘాల నేతలు, కేంద్రం మధ్య ఇప్పటివరకు ఐదు సార్లు చర్చలు జరిగినా అవి ఫలించలేదు. కాగా చర్చల ద్వారానే సాగు చట్టాలపై ప్రతిష్టంభన తొలగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. అన్నదాతలు తమ ఉద్యమాన్ని ఆపి.. ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని కోరారు. కొత్త చట్టాల ప్రాముఖ్యతను రైతులు తప్పకుండా అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా తోమర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త చట్టాలపై పంజాబ్ రైతుల్లో కొంత ప్రతికూల అభిప్రాయం ఏర్పడిందని, అయితే ఒకసారి చర్చలు జరిపిన తర్వాత అపోహలన్నీ తొలగిపోయి చట్టాలపై వారికి పూర్తి అవగాహన వస్తుందని అన్నారు.నూతన చట్టాలకు వ్యతిరేకంగా గత నెల రోజులుగా దిల్లీ శివారుల్లో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రైతులు నిర్విరామంగా నిరసన సాగిస్తున్న విషయం తెలిసిందే. కొత్త చట్టాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నాయకులతో ఐదు దఫాలుగా చర్చలు జరిపింది. కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ సహా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ చర్చల్లో పాల్గొని రైతులకు వివరణ ఇచ్చారు. అయితే కేంద్రం చేసిన ప్రతిపాదనలను రైతులు తోసిపుచ్చారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని, అప్పటిదాకా ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం కేంద్రం మరోసారి రైతులను చర్చలకు ఆహ్వానించింది. దీనిపై రైతు సంఘాలు నేడు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.మరోవైపు కొత్త సాగు చట్టాల వల్ల రైతులకు నష్టం జరిగే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి కింద నేడు రూ. 18వేల కోట్ల నిధులను విడుదల చేసిన మోదీ.. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో జరిగిన కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొని రైతులతో మాట్లాడారు. ప్రతిపక్షాలు కావాలనే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు.