ఉద్యాన శాఖలో ఎన్ని పథకాలు ఉన్నాయో జర చెప్పండి సారూ
ఖమ్మం, జూలై 30 : ఓ పక్క ఖరీఫ్ వ్యవసాయ పనుల వేగం పుంజుకుంది. మరో పక్క వ్యవసాయ శాఖ రైతుల పట్ల ఆశించినంత వేగంగా సేవలు అందించలేకపోతోంది. దీంతో అన్నదాత ప్రైవేటును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అంతకంటే ఎక్కువ కష్టాల్లో ఉద్యాన శాఖ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని రైతుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ఉద్యాన శాఖ మంత్రి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆ శాఖలో ఎన్ని పథకాలు ఉన్నాయో సంబంధిత అధికారులు చెప్పే పరిస్థితుల్లో లేరని రైతులు వాపోతున్నారు. పట్టణ నడిబొడ్డున ఉద్యాన శాఖ కార్యాలయం ఉన్నప్పటికీ అధికారులు సరిగా అందుబాటులో ఉండడం లేదని సమాధానం చెప్పే వారే లేరని రైతులు ఆరోపిస్తున్నారు. గత మామిడి సీజన్‌లో ఈదురు గాలులు, అకాల వర్షాల మూలంగా పంట నష్టం ఏర్పడిన రైతుల వివరాలను సేకరించడంలో జరిగిన జాప్యం నేపథ్యంలో ఈ రోజుకు కనీసం ఖర్చు అయిన నగదు సైతం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారులు వారానికి రెండు రోజులకు కూడా అందుబాటులో ఉండడంలేదని రైతులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల కోసం ఉద్యాన శాఖ అనేక సబ్సిడీ పథకాలు అమలు చేస్తున్నట్టు ప్రకటనల ద్వారా తెలుసుకుంటున్న రైతులు అవి క్షేత్ర స్థాయిలో కార్యారూపం దాల్చడంలేదని రైతులు తెలిపారు. బహు వార్షిక, ఏక వార్షిక పథకాల కింద సబ్సిడీపై మామిడి, జామ, అరటి, బొప్పాయి మొక్కలతో పాటు ఎరువులు, పురుగు మందులు, మిర్చి, ఆకు కూరలు కూరగాయల పంటల అభివృద్ధి కోసం జాతీయ ఉద్యాన మిషన్ ద్వారా రావాల్సినంతగా నిధులు విడుదలైనట్టు ప్రభుత్వం ప్రకటిస్తోందని కాని, ఆ సమాచారం ఏదీ రైతులకు చేరడంలేదని అంటున్నారు. కలుపు నివారణకు సబ్సిడీ, నీటి గుంటల ఏర్పాటు, కలుపు తీసే యంత్రాలు, కూరగాయల వ్యాపారుల కోసం వాహనాల కొనుగోలు కోసం రుణాలు కల్పిస్తున్నట్టు ఉద్యాన శాఖ ప్రకటిస్తోందని, అవి ఏ స్థాయి రైతుల కోసం ఉద్దేశించినవో, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో సమాచారం అందడంలేదని జిల్లాలోని రైతులు వాపోతున్నారు. గడిచిన మూడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొందని, ఇప్పటికైనా జిల్లాకు చెందిన ఉద్యాన శాఖ మంత్రి చొరవ తీసుకుని రైతులకు ఎలాంటి పథకాలు అందుతున్నాయో వివరించాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఈ శాఖ నుంచి లభించే ప్రభుత్వ పథకాలు గోప్యంగా ఉంచడం వల్ల ఒక వర్గం రైతులకే ఉపయోగపడుతున్నట్టు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ చొరవ తీసుకుని ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.