ఉద్యోగ నియామకాల్లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ
ఉద్యోగ నియామకాల్లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ
పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనతో చరిత్ర సృష్టించాం
ఉద్యోగార్థులైన యువతకు ఉచితంగా శిక్షణా కార్యక్రమం
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్
ఆవిర్భావ వేడుకల్లో సిఎం కెసిఆర్ వెల్లడి
హైదరాబాద్,జూన్2(జనంసాక్షి): ఉద్యోగ నియామకాల్లో యావత్ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. పెద్ద మొత్తంలో ఉద్యోగాల కల్పనతో ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. ఉద్యోగార్థులైన యువతీ, యువకులకు ఉచితంగా శిక్షణా కార్యక్రమం అమలు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ’తెలంగాణ పోరాట నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. రాష్ట్రం ఏర్పడిన తరువాత మన నిధులు మనకే దక్కుతున్నాయి. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. గడిచిన ఎనిమిదేండ్లలో లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకున్నట్లు వెల్లడిరచారు. ప్రస్తుతం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి భర్తీచేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే దీర్ఘకాలంగా కాంట్రాక్టు పద్ధతిలో
పనిచేస్తున్న 11,103 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించింది. ఇంకా ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలను కొత్తవారితో భర్తీ చేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 2,24,142 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరపటం ద్వారా తెలంగాణ యావద్దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఉద్యోగార్థుల వయోపరిమితిపై ప్రభుత్వం పదేండ్ల సడలింపునిచ్చింది. ఇప్పటికే వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీ కూడా ప్రారంభమైంది. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షలలో పోటీపడేందుకు వీలుగా మధ్యమధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. స్థానిక అభ్యర్థులకు సంపూర్ణంగా న్యాయం జరగడానికి కావల్సిన పటిష్టమైన వ్యవస్థను, విధానాన్ని ప్రభుత్వం రూపొందించి అమలుచేస్తున్నది. దీనికోసం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 371`డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను సాధించింది. ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చారిత్రాత్మకమైన విజయం. ఈ సవరణ వల్ల ఇకనుంచి అటెండర్ నుంచి, ఆర్డీవో దాకా స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ అమలవుతుంది. ఈ విధంగా స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేయడంతోపాటు భోజన వసతి కూడా కల్పిస్తున్నది. అదే విధంగా బీసీ స్టడీ సర్కిళ్లలోనూ శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్నది’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ వికాసం కోసం మొదటిదశలో గురుకుల విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. దేశంలో అత్యధికంగా 978 గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా విద్యార్థినీ, విద్యార్థులకు సమగ్ర శిక్షణనిస్తూ ఈ గురుకులాలు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ’మన ఊరు`మన బడి’ అనే బృహత్తర కార్యక్రమానికి నాంది పలికింది. వర్తమాన కాల అవసరాలకు తగినట్టుగా పాఠశాలల్లో అధునాతన మౌలిక వసతుల కల్పనను పెద్దఎత్తున చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.7,289 కోట్ల వ్యయంతో దశలవారీగా అన్ని పాఠశాలల్లో అభివృద్ధిపనులు చేపడతున్నది. మొదటి దశలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో రూ.3,497 కోట్ల వ్యయంతో కార్యాచరణ ప్రారంభించిందన్నారు. ఉన్నత విద్యలో మహిళలు ముందుండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం రాష్ట్రంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా అటవీ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్ చెప్పారు.