ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్‌ జంతర్‌మంతర్‌ ర్యాలీ

del_77

మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నకాంగ్రెస్‌

సోనియా, రాహుల్‌,మన్మోహన్‌ అరెస్ట్‌..విడుదల

ఎలాంటి పోరాటాలకైనా సిద్దం అన్న సోనియా

న్యూఢిల్లీ,మే6(జ‌నంసాక్షి): పార్లమెంటులో అగస్టా కుంభకోణం ప్రకంపనలు సృష్టించడంతో కాంగ్రెస్‌  దాని నుంచి బయటపడేందుకు కాంగ్రెస్‌ ప్రతివ్యూహం రచించింది.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ దేశరాజధాని న్యూఢిల్లీలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. మోదీ ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ నేడు ఢిల్లీలో లోక్‌తంత్ర్‌ బచావో పేరుతో యాత్ర పేరుతో భారీ ర్యాలీని చేపట్టింది. అనంతరం జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన దీక్షను చేపట్టింది. సోనియాతో పాటు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇతర పార్టీ నేతలంతా కలిసి ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా అనంతరం పార్లమెంటుకు బయలుదేరిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కాంగ్రెస్‌ ప్రముఖులనంతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది సేపటి తర్వాత వారిని వదిలేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సహా పలువురు పార్టీ నేతలను పార్లమెంటు స్ట్రీట్‌  పోలీసు స్టేషన్‌కు తరలించి అనంతరం విడిచిపెట్టారు. దిల్లీ పోలీసులు, ఎస్పీజీ సెక్యూరిటీ అధికారులు పార్టీ నేతలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. బారికేడ్లు తొలగించి ర్యాలీ చేసేందుకు ప్రయత్నించడంతో నిబంధనలు ధిక్కరించారని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ నేతలు సోనియా, రాహుల్‌,మన్మోహన్‌లు ప్రభుత్వ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. బిజెపి పాలనలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందని మండిపడ్డారు. బిజెపి అబద్ధపు ప్రమాణాలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంటే కాంగ్రెస్‌ ఊరుకోదన్నారు.  జీవితంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నా. ఎప్పుడూ పోరాడుతూ ఉండాలని జీవితం నాకు నేర్పించింది. ధనబలంతో ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ప్రభుత్వాలను కూల్చారని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడలని సోనియా కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నట్లు సోనియాగాంధీ అన్నారు.  బీజేపీ ప్రభుత్వానికి ఓ సందేశం ఇవ్వడానికే మనమంతా ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సందర్భంగా నేను విూకు ఒక్కటే చెప్పదలచుకున్నా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను గద్దెదించుతున్న మోదీ చర్యలు ఇకపై కొనసాగకుండా ఎదుర్కొవాలి. జీవితం నాకు పోరాడటం నేర్పింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. జాతి వ్యతిరేక శక్తులతో పోరాడటం మనకు కొత్తేం కాదు. దేశ రక్షణలో మనం ప్రాణాలు అర్పించాం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎటువంటి త్యాగాలు చేసేందుకైన సిద్ధంగా ఉన్నామని, ప్రజాస్వామ్యంపై జరిపే దాడిలో బీజేపీ విజయం సాధించకుండా చూస్తామని ఆమె పేర్కొన్నారు.

అచ్చేదిన్‌ అంటే ఇదేనా: రాహుల్‌

ప్రతిరోజు దేశంలో 50 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మోదీ అచ్చేదిన్‌ ఆయేగా అంటే ఇదేనా అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశం ఈ రోజు దుఃఖసంద్రంలో ఉంది. రోజుకు 50 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దేశంలోని 40 శాతం

భూభాగం కరువుతో అల్లాడుతుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నేతలను తొలగిస్తున్నారు. చట్టాలన్నింటినీ ఉల్లంఘిస్తారు. మోదీకి, బీజేపీకి ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడినా అసత్య ఆరోపణలతో నిర్భందిస్తున్నారు. దేశంలో నేడు ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌, నరేంద్రమోదీ ఇద్దరి రాజ్యమే నడుస్తుంది. ఇదేనా మోదీజీ అచ్చే దిన్‌ ఆయేగా అంటే అని ఆయన ప్రశ్నించారు.  లాతూర్‌, బుందేల్‌ఖండ్‌ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని మోదీ వాటి గురించి ఏం మాట్లాడట్లేదని రాహుల్‌ గాంధీ అన్నారు. మోదీ నినదించిన అచ్చేదిన్‌ ఇంకా రాలేదని విమర్శించారు. కరవు పీడిత రైతులకు, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఎలాంటి ఉపశమనం కలగలేదని రాహుల్‌ గాంధీ అన్నారు.

కాంగ్రెస్‌లోనే భారతీయాత్మ: మన్మోహన్‌

భారతీయ ఆత్మ కాంగ్రెస్‌లో ఉందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ ప్రభుత్వం దాడికి పాల్పడుతుందంటూ పేర్కొంటూ కాంగ్రెస్‌ పార్టీ నేడు ఢిల్లీలో లోక్‌తంత్‌ బచావో యాత్ర పేరుతో ర్యాలీని చేపట్టింది. అదేవిధంగా జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన దీక్షను నిర్వహించింది. దీక్షలో పాల్గొన్న మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి,  ప్రభుత్వానికి నేను ఒక్కటే చెప్పదలచుకున్నా భారతీయ ఆత్మ కాంగ్రెస్‌ పార్టీలో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రవహిస్తున్న నది వంటిది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్ని అసత్య ఆరోపణలు, చర్యలు తీసుకున్నా దాని పయనమార్గాన్ని నిలువరించలేరు. బీజేపీ ప్రభుత్వం ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంది. మోదీ ప్రజాస్వామ్యంపై దాడికి పాల్పడ్డారు. ఇప్పడు ఆయన దృష్టి ఇతర కాంగ్రెస్‌ పాలిత రాష్టాల్రపై పడింది. కాంగ్రెస్‌ ఎల్లప్పుడు త్యాగాలనే చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంది. దీనినే ఇకపై కూడా కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌కు కాంగ్రెస్‌ రహిత దేశంగా మార్చడమే భాజపా అజెండా అంటూ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విమర్శలు చేశారు. కానీ ఆ ప్రయత్నంలో భాజపా విఫలమవుతుందన్నారు. భాజపా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణం పేరుతో అందరి దృష్టి మళ్లిస్తోందని కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ ధ్వజమెత్తారు.కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్న రాష్టాల్లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని సచిన్‌ పైలట్‌ పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి తామంతా ఒకదగ్గరికి వచ్చామని మల్లికార్జున్‌ ఖర్గే స్పష్టం చేయగా, సీబీఐ, ఈడీలను ఎన్డీయే ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని జితేంద్ర సింగ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతల ప్రసంగం అనంతరం నాయకులంతా జంతర్‌ మంతర్‌ నుంచి పార్లమెంటుకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అయితే నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని సోనియా, రాహుల్‌, మన్మోహన్‌సింగ్‌లను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.